తెలుగు రాష్ట్రాలను కరుణించిన వరుణుడు.. సేదతీరిన జనం
గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతోన్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం దక్కింది. మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్తంత సేదతీరారు. యువత రోడ్ల మీదకు వచ్చి కేరింతలు కొట్టడంతో పాటు ఫోటోలు , వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాదాపు గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ సైతం వర్షం కారణంగా రద్దయ్యింది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలగా, కుర్చీలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో సీఎం సభను వాయిదా వేశారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే పలు ప్రాంతాల్లో పిడుగులు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల కారణంగా కరెంట్ స్తంభాలు నేలకూలి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Comments
Post a Comment