bangalore rave party : అప్పటి వరకు హేమ నిర్దోషే .. ‘ మా ’ అధ్యక్షుడు మంచు విష్ణు వ్యాఖ్యలు

 


బెంగళూరు రేవ్ పార్టీ కేసు గంట గంటకో మలుపు తిరుగుతోంది. ఈ సంగతేమో కానీ టాలీవుడ్ నటి హేమ వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పార్టీలో అడ్డంగా దొరికిపోయినా బుకాయించే ప్రయత్నం చేసి తన పరువు తానే పొగొట్టుకోవడమే గాక టాలీవుడ్‌కి తలవంపులు తీసుకొచ్చింది. తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నించింది. 

హేమ అనే పేరును దాచి కృష్ణవేణి అని చెప్పడంతో పాటు స్పాట్‌లోంచి వీడియో తీసి తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చి సమాజాన్ని, మీడియాను తప్పుదోవ పట్టింది. బ్లడ్ టెస్టులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావంతో హేమ సైలెంట్ అయ్యింది. ఆమెకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు త్వరలో విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు.

ఇదిలావుండగా హేమపై వస్తోన్న ఆరోపణలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హేమ దోషిగా తేలే వరకు ఆమెను నిర్దోషిగానే పరిగణించాలని విష్ణు చెప్పారు. ఈ కేసులో హేమకు సంబంధించిన ఆధారాలను ఇస్తే మా అసోసియేషన్ సైతం తగిన చర్యలు తీసుకుంటుందని పోలీసులకు ఆయన సూచించారు. విషయం తేలేవరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేయొద్దని విష్ణు హితవు పలికారు. 

ఇకపోతే.. రేవ్ పార్టీకి ప్రధాన సూత్రధారి అయిన లంకపల్లి వాసు సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని బ్రహ్మంగారి వీధికి చెందిన వాసుకి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో అతని తల్లి టిఫిన్ బండి నడిపి కుటుంబాన్ని పోషించింది. వాసుకి అక్క, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. 

క్రికెట్ అంటే పిచ్చి కావడంతో నిదానంగా బుకీగా మారాడు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన వాసు వందలాది మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. విజయవాడకు నెలకు ఒకటి లేదా రెండు సార్లు వస్తూ , పోతుండే వాసు ఎవరైనా అడిగితే తనకు విదేశాల్లో వ్యాపారాలు వున్నాయని చెప్పేవాడు. బెట్టింగ్, ఇతర వ్యాపారాలతో వందల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీతో వాసు చీకటి బాగోతం బయటపడింది. 


Comments