ఇరాన్ : ఇబ్రహీం రైసీని ‘Butcher of Tehran’ అని ఎందుకు పిలుస్తారు

 


ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాల్వడంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. రైసీ ప్రయాణిస్తున్న ఛాపర్ నిన్న అజర్‌‌బైజాన్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీరబ్దోల్లహియన్, ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్‌మతీ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరుదేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి ఇబ్రహీం రైసీ వాటిని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే హోస్సేన్, మలేక్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. మరో రెండు హెలికాఫ్టర్లూ అధ్యక్షుడిని అనుసరించాయి. అయితే జోల్ఫా నగర సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అజర్‌బైజాన్, ఇరాన్, టర్కీ దేశాలకు చెందిన సాయుధ బలగాలు, సహాయక బృందాలు నిర్వహించిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో రైసీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కనుగొన్నారు. దేశాధ్యక్షుడు, విదేశాంగ మంత్రి తదితరుల మరణంతో ఇరాన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రైసీ మృతికి పలువురు ప్రపంచ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. 

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో హౌతీల అలజడి తీవ్రంగా ఉన్న తరుణంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆకస్మిక మరణం ఆదేశానికి తీరని లోటే. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా తీసుకున్న రైసీ.. దేశ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేని మార్గదర్శకత్వంలో ఇజ్రాయెల్‌పై గత నెలలో వందలాది డ్రోన్, క్షిపణి దాడికి ఆదేశించారు. ఇరాన్ అనుకూల శక్తుల సాయంతో ఇజ్రాయెల్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని రైసీ యోచిస్తున్న వేళ ఆయన ప్రాణాలు కోల్పోవడంపై దేశ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణంగా ఎక్కడైనా దేశాధ్యక్షుడు మరణిస్తే దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమవుతుంటారు. కానీ దీనికి భిన్నంగా కొందరు ఇరానీయన్లు జైసీ మృతితో సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షుడి హెలికాఫ్టర్ మిస్ అయిన నాటి నుంచే ఆకాశంలో బాణాసంచా కాల్పులు కనిపించాయి. దీనికి కారణాలు లేకపోలేదు.. ఆ దేశంలోని సామాజిక కార్యకర్తలు రైసీని ‘‘బచర్ ఆఫ్ టెహ్రాన్ ’’ అని పిలుస్తారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత 1988లో వేలాది మంది రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీసే వ్యవహారాన్ని పర్యవేక్షించిన నలుగురు న్యాయమూర్తులలో రైసీ ఒకరని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 

యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ 2019 నాటి తన ఆంక్షల ప్రకటనలో వేలాదిమంది రాజకీయ ఖైదీలను చట్టవిరుద్ధంగా ఉరితీయాలని ఆదేశించిన ‘‘డెత్ కమీషన్’’లో ఇబ్రహీం రైసీ ఒకరిన పేర్కొంది. ఆయన పదవీకాలంలో ఇరాన్ యురేనియంను గతంలో కంటే ఎక్కువగా నిల్వ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు , తన పొరుగు దేశాల్లోని సాయుధ మిలీషియా గ్రూపులకు బాంబులు మోసకెళ్లగలిగే డ్రోన్‌లను ఇరాన్ సరఫరా చేయడంతో పశ్చిమ దేశాలు టెహ్రాన్‌పై గుర్రుగా ఉన్నాయి. 

ఇరాన్ తన ఆర్ధిక వ్యవస్ధ, మహిళల హక్కుల అణిచివేత, షియా మతతత్వానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి సామూహిక నిరసనలను ఎదుర్కొంది. గతంలో దేశ న్యాయవ్యవస్ధకు నాయకత్వం వహించిన ఇబ్రహీం రైసీని .. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వారసుడిగా భావించారు. ఖమేనీ మరణం లేదా రాజీనామా తర్వాత రైసీ ఆ పదవిని అధిష్టిస్తారని భావించారు. చారిత్రాత్మకంగా తక్కువ ఓటింగ్‌ జరిగిన ఎన్నికలలో అనేకమంది ప్రముఖ అభ్యర్ధులపై అనర్హత వేటు పడిన తర్వాత ఆగస్ట్ 2021లో రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మొహమ్మద్ ప్రవక్తకు గుర్తుగా నల్లటి తలపాగాను ధరించారు. 

అయితే 2022లో 22 ఏళ్ల మహ్సా అమినీ హత్య తర్వాత సామూహిక్ నిరసనలపై అణిచివేత, మహిళల డ్రెస్సింగ్ కోడ్‌ను కఠినంగా అమలు చేయడం , చారిత్రక అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత యురేనియం నిల్వలు ఇక్కడ అసాధారణంగా పెరిగిపోయాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఇరాన్ తన మద్ధతును ఇవ్వడం వెనుక ఇబ్రహీం రైసీ కీలకపాత్ర పోషించారని అంటారు. 



Comments