ఎల్లుండే పోలింగ్.. సిబ్బంది ఆహారంపై ఈసీ ప్రత్యేక శ్రద్ధ, మెనూ ఇదే
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం (మే 13) నాడు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆరోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే రోజున జరగనున్నాయి. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన తెలుగునాట ఎన్నికలకు వుండే క్రేజ్ సాధారణమైంది కాదు. శనివారంతో ఇక్కడ ప్రచార గడువు ముగియనుండగా.. 48 గంటల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మే నెలలో ఎండలు తీవ్రంగా వుండే నేపథ్యంలో సిబ్బంది కోసం ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల విధుల్లో వున్న సిబ్బందికి పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించింది. తొలుత 12వ తేదీ (ఆదివారం) ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ.. 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. రాత్రి భోజనంలో అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ అందిస్తారు.
పోలింగ్ రోజున (మే 13) ఉదయం 6 గంటలకు టీ, 2 అరటి పండ్లు ఇస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య క్యారెట్, టమోటాతో చేసిన ఉప్మా, పల్లీల చట్నీ వడ్డిస్తారు. ఉదయం 11, 12 గంటల సమయంలో మజ్జిగ .. మధ్యాహ్నం 1 గంటకు భోజనంలో కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందిస్తారు.
మధ్యాహ్నం 3, 4 గంటల సమయంలో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. 5.30 గంటలకు టీ, బిస్కెట్లు అందజేస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను, సిబ్బందికి అందించే ఆహారాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఫ్యాన్లు, అవసరం అనుకుంటే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Post a Comment