ప్రజ్వల్ రేవణ్ణపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్ .. అసలేంటిది..?
మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం కేసులో దేశం విడిచివెళ్లిన మాజీ ప్రధాని , జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు , ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అభ్యర్ధనపై ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్)స్పందించింది. దీని ప్రకారం ప్రజ్వల్ రేవణ్ణ తమ అధికార పరిధిలోని ఏదైనా ఓడరేవులో కనిపిస్తే గుర్తించి తక్షణం ఇవ్వడానికి మొత్తం 196 సభ్యదేశాలను అప్రమత్తం చేశామని ఇంటర్‌పోల్ పేర్కొంది.
తన వద్ద పనిచేసే మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఆదివారం బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నాగలక్ష్మీ చౌదరి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఇది జరిగిన గంటల్లోనే ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్లారు. గతవారం .. ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులోని జస్టిస్ సంతోష్ గజానన్ భట్ బెంచ్ తిరస్కరించింది.
బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏమిటి :
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్‌పోల్ పంచుకుంటుంది. పారిపోయిన వారిని గుర్తించడానికి సాంకేతిక, పరిశోధనాత్మక మద్ధతును అందిస్తుంది. ఈ ఏజెన్సీ అన్ని సభ్యదేశాలలో నేషనల్ సెంట్రల్ బ్యూరోను కలిగి వుంది. ఇది ఆ దేశంలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఇంటర్‌పోల్ మధ్య వారధిలా పనిచేస్తుంది. భారతదేశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) .. ఇంటర్‌పోల్‌కు నోడల్ ఏజెన్సీకి నియమించబడింది.
సభ్యదేశాలు, యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఆంక్షలు, మారణహోమం, యుద్ధనేరాలు) వంటి ప్రపంచ సంస్థల మధ్య నేర సంబంధిత సమాచారం .. ఆయా దేశాలను హెచ్చరించడానికి, పంచుకోవడానికి ఇంటర్‌పోల్ ‘‘కలర్ - కోడెడ్ ’’ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.
ప్రస్తుతం ఇందులో 8 రకాల నోటీసులు వున్నాయి. వీటిలో అత్యంత సాధారణమైనది ‘రెడ్ ’ నోటీసు. ప్రాసిక్యూషన్ కోసం కోరుకున్న వ్యక్తి స్థానం , అరెస్ట్ గురించి సభ్యదేశాలను అప్రమత్తం చేయడానికి ఉపయోగించబడుతుంది. ‘ఎల్లో’ కార్నర్ నోటీసులను తప్పిపోయిన వ్యక్తి కోసం వాడతారు. అపహరణలు, కిడ్నాప్‌లు లేదా అదృశ్యమైన బాధితుల కోసం ఉపయోగిస్తారు.
గుర్తు తెలియని మృతదేహాలపై సమాచారం కోరేందుకు ‘బ్లాక్’ నోటీసు జారీ చేస్తారు. ‘గ్రీన్’ నోటీస్ ద్వారా ప్రజల భద్రతకు ముప్పు గురించి హెచ్చరించవచ్చు. ఒక వ్యక్తి, ఒక వస్తువు లేదా ఏదైనా సంఘటన.. భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తే ‘ఆరెంజ్’ నోటీసు ఉపయోగిస్తారు.
నేరస్తులు ఉపయోగించే వస్తువులు, పరికరాలు, దాచే పద్ధతులపై సమాచారాన్ని శోధించేందుకు, అందించడానికి ‘పర్పుల్’ నోటీసు జారీ చేస్తారు. ‘‘ ఇంటర్‌పోల్ -యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రత్యేక నోటీసు ’’ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీల లక్ష్యాలుగా వున్న సంస్థలు, వ్యక్తుల కోసం జారీ చేస్తారు.
ఇక ప్రజ్వల్ రేవణ్ణపై జారీ చేసిన ‘‘బ్లూ కార్నర్ నోటీసు’’ విషయానికి వస్తే దీనిని ‘‘ఎంక్వైరీ నోటీసు ’’ అని కూడా పిలుస్తారు. ఇది రెడ్ కార్నర్ నోటీసుకు భిన్నంగా వుంటుంది. 2020లో సెల్ఫ్ స్టైల్ గాడ్మన్ నిత్యానందపై అత్యాచారం ఆరోపణలు రావడంతో అతను ప్రస్తుతం ఎక్కడ వున్నారో సమాచారం కోరుతూ ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు విషయానికి వస్తే.. ఆయన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు దాదాపు 3000 స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి.

Comments
Post a Comment