కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం .. దేవెగౌడ కుమారుడు రేవణ్ణ అరెస్ట్
లోక్‌సభ ఎన్నికల వేళ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, karమనవడు ప్రజ్వల్ రేవణ్ణలు అభ్యంతరకర వీడియోలు, లైంగిక వేధింపుల వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లగా.. కేసును సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రేవణ్ణను సిట్ అధికారుల బృందం శనివారం అదుపులోకి తీసుకుంది. బెంగళూరు పద్మనాభ నగర్‌లోని దేవెగౌడ నివాసంలో రేవణ్ణను అరెస్ట్ చేశారు. రేవణ్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ప్రజాప్రతినిధుల కోర్టు నిరాకరించడంతో ఆయనను సిట్ అదుపులోకి తీసుకుంది.
గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన తన తల్లి కిడ్నాప్‌కు గురైందని.. ఆమె కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా సిట్ రేవణ్ణను అరెస్ట్ చేసింది. అంతేకాదు.. లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, అత్యాచారాన్ని వీడియో చిత్రీకరణ, కిడ్నాప్ వంటి ఆరోపణలపై తండ్రీకొడుకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసిన మరుసటిరోజున (ఏప్రిల్ 27) ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లారు.
మరోవైపు.. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి.. ఈ దారుణాన్ని వీడియోగా తీసి బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోరాలని కర్ణాటక ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి విజ్ఞప్తి చేసింది. జేడీఎస్ మహిళా కార్యకర్త ఒకరు.. తనపై తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం చేశాడని ఆరోపించడంతో అతనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మైసూరు జిల్లా కలేనహళ్లి గ్రామంలోని రేవణ్ణ వ్యక్తిగత సహాయకుడు రాజశేఖర్‌కు చెందిన ఫాంహౌస్ నుంచి మహిళను రక్షించినట్లు వార్తాసంస్థ ఐఏఎన్ఎస్ నివేదించింది. ఏప్రిల్ 29న అదృశ్యమైన మహిళను పక్కా సమాచారంతో అక్కడి చేరుకున్న సిట్ అధికారులు విడిపించారు. సిట్ తన ఫాంహౌస్‌పై దాడులు నిర్వహించినప్పటి నుంచి రాజశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా మీడియా నివేదించింది. ఆయనను అరెస్ట్ చేసి బెంగళూరులో స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Post a Comment