హిమాచల్ అందాల్ని కెమెరాలో బంధించిన మోడీ .. వీడియో చూశారా ..!!

 


ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంత పర్యటనకు వెళ్తే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా తన వేష భాషలు మార్చేస్తారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నాటి నుంచి నేటి వరకు ఆయనది ఇదే శైలి. ఇదే మోడీని మిగిలిన నేతలతో ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధుల తరపున ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన మోడీ.. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కాసేపు సేదతీరారు. స్టిల్ కెమెరా తీసుకుని హిమాచల్ అందాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండిలో మోడీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రధానికి నమస్కరించి.. గులాబీని అందజేసి కంగనా స్వాగతం పలికారు. అంతకుముందు ఆమె ప్రసంగిస్తూ మోడీ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు కంగనా కృతజ్ఞతలు తెలిపారు. 

దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కూడా ఆమె కొనియాడారు. బాలీవుడ్ నన్ను బయటి వ్యక్తిగా భావించి.. నా ఇంగ్లీష్‌ను ఎగతాళి చేసినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడు మోడీ...మండి ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఎంచుకున్నారని కంగనా చెప్పారు.  

మోడీ మార్గదర్శకత్వంలో పనిచేసే రోజు వచ్చిందని.. ప్రధానిని అభినందించడం సూర్యుడికి కొవ్వొత్తి చూపించినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ చేసిన సాంకేతిక, ఆధునిక అభివృద్ధి పనులు అపారమైనవని.. తాను కూడా ఇప్పుడు మోడీ టీమ్‌లో భాగమయ్యానని కంగనా చెప్పారు. పార్టీ కార్యకర్తగా మండి అభివృద్ధికి కట్టుబడి వున్నానని ఆమె తెలిపారు. 

తన ప్రసంగాన్ని ముగిస్తూ.. తనకు పార్లమెంటేరియన్ అవార్డును గెలుచుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో తన ప్రతిభతో నాలుగు అవార్డులను గెలుచుకున్నానని.. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే తొలి సంవత్సరంలోనే పార్లమెంటేరియన్ అవార్డును అందుకుంటానని కంగనా రనౌత్ ధీమాగా చెప్పారు. 


Comments