ఎయిరిండియా ఫ్లైట్‌లో మంటలు : ప్రార్ధనలు, ఏడుపులు .. భయానక పరిస్థితిని వివరించిన ప్రయాణీకుడు
బెంగళూరు నుంచి కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రయాణీకులకు పీడకలగా మారగా.. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తించింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో 179 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగినట్లుగా గుర్తించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏటీసీకి సమాచారమిచ్చారు. దీంతో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యంత్రాంగం సమన్వయంగా వ్యవహరించడంతో రాత్రి 11.12 గంటలకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అవ్వగా.. ఓపెన్ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులు బయటకు వచ్చారు. అప్పటికే అధికారులు ఫైరింజిన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రత్యేక బస్సుల ద్వారా వారిని రన్ వే నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి తరలించారు.
ఇదిలావుండగా.. మంటలు చెలరేగిన విషయం తెలిసి, విమానం గాల్లో ఉండగా ప్రయాణీకులు చావును దగ్గరి నుంచి చూశారు. ఫ్లైట్ క్షేమంగా దిగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ గడిపారు. ఈ భయంకర అనుభవాన్ని ప్రయాణీకులలో ఒకరైన డాక్టర్ జెఫీ చెర్రీ పంచుకున్నారు. త్రిసూర్‌లో దంతవైద్యుడిగా పనిచేస్తున్న ఆయన ప్రయాణీకులందరికీ భద్రత కల్పించడం పట్ల సిబ్బందిని అభినందించారు. చీకట్లో విమానం రెక్కల వద్ద నిప్పు రవ్వలు కనిపించాయని చెర్రీ వివరించారు.
బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డాక్టర్ చెర్రీ, అతని తల్లి సీఎం శాంత శనివారం ఉదయం ఇండిగో విమానంలో బెంగళూరుకు వచ్చారు. టెర్మినల్ - 2 నుంచి IX 1132 నెంబర్ విమానంలో తిరిగి ఇంటికి బయల్దేరారు. ఫ్లైట్ శనివారం రాత్రి 9 గంటలకు బయలుదేరాల్సి వుందని, అయితే ఇది ఇంకా ఎయిర్‌పోర్ట్‌కు రాలేదని చెర్రీ తెలిపారు. విమానం గంట ఆలస్యంగా బయల్దేరుతుందని ఎయిర్‌లైన్స్ సంస్థ మాకు ముందుగానే సమాచారం అందించిందని ఆయన వివరించారు.
ఎట్టకేలకు రాత్రి 10.30 గంటలకు బోర్డింగ్‌కు అనుమతించగా, కొద్దిసేపటికే విమానం టేకాఫ్ అయ్యిందని చెర్రీ తెలిపారు. ఎక్కువ మంది ప్రయాణీకులు కేరళకు చెందినవారేనని.. తాను విమానం ఎడమవైపు భాగంలో మధ్యలో కూర్చొన్నానని, అయితే ఫ్లైట్‌కు కుడివైపు నుంచి ‘థడ్’ శబ్ధం వినిపిస్తూ.. అది ఒక్కసారిగా పెరిగిందన్నారు. ఇంతలో ఓ పాప తనకు విమానం రెక్క భాగంలో మంటలు కనిపిస్తున్నాయని కేకలు వేసిందని , దీంతో అంతా కుడివైపు ప్రాంతంలో చూడగా మంటలు కనిపించాయని చెర్రీ వెల్లడించారు.
అనంతరం హుటాహుటిన క్రూ మెంబర్‌ని అలర్ట్ చేయగా..అతను కూడా చూసి తక్షణం పైలట్‌ని అప్రమత్తం చేశాడని డాక్టర్ చెప్పారు. ఫ్లైట్ సిబ్బంది మమ్మల్ని తక్షణం సీట్లలో కూర్చోవాలని సూచించారని.. ఇంతలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం తిరిగి బెంగళూరు వెళ్తుందని మైక్‌లో అనౌన్స్ చేశారని చెర్రీ పేర్కొన్నారు. ఇది విన్న తర్వాత అంతా షాక్‌కు గురై భయపడ్డారని తెలిపారు. కేబిన్ సిబ్బంది పరిస్ధితికి అనుగుణంగా నడుచుకుంటున్నారని.. మరోవైపు ప్రయాణీకులంతా తమను రక్షించాల్సిందిగా ప్రార్ధనలు చేస్తున్నారని, మరికొంతమంది ఏడుస్తున్నారని డాక్టర్ వివరించారు.
చీకటి కావడంతో మంటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని, దీంతో భయం ఇంకాస్త ఎక్కువైందన్నారు. విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను తెరిచి ప్రయాణీకులను తరలించారని డాక్టర్ పేర్కొన్నారు. క్యూలో రావాల్సిందిగా చెప్పినప్పటికీ.. కొందరు ప్రయాణీకులు ప్రాణభయంతో నెట్టుకుంటూ, పరిగెత్తుకుంటూ వచ్చారని చెర్రీ తెలిపారు. కొంతమంది తమ లగేజీని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా.. సిబ్బంది వారించారని డాక్టర్ పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ ఎస్కేప్ స్లయిడ్‌ల ద్వారా ప్రయాణీకులను వేగంగా విమానం నుంచి కిందకు దించారని .. వృద్ధులు భయపడగా సిబ్బంది వారికి ధైర్యం చెప్పారని , అనంతరం తమను షటిల్ బస్‌లో ఎక్కించి విమానాశ్రయంలోకి తరలించారని డాక్టర్ చెర్రీ స్పష్టం చేశారు. తమకు ఆహారం, తాగునీరు అందించినప్పటికీ విమానాశ్రయంలో సరైన మద్ధతు కరువైందని ఆయన పేర్కొన్నారు. చాలామంది తమ హ్యాండ్‌బ్యాగ్‌లను విమానంలోనే వదిలేశారని , అయితే లగేజీ మొత్తం కొచ్చిలో అందజేస్తామని సిబ్బంది వెల్లడించారని, దీంతో ప్రయాణీకులు వారితో గొడవకు దిగారని డాక్టర్ పేర్కొన్నారు.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు మరో విమానంలో కొచ్చికి పంపుతామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది తమకు చెప్పారని , కానీ చాలామంది లగేజీ లేకుండా ప్రయాణించడానికి నిరాకరించారని డాక్టర్ చెప్పారు. అయితే విమానం బయల్దేరే సమయాన్ని పలుమార్లు మార్చగా.. చివరికి ఆదివారం ఉదయం 11.30 గంటలకు విమానం కొచ్చికి బయల్దేరిందని జెఫీ చెర్రీ తెలిపారు.
Kochi-bound Air India Express flight with 179 passengers makes emergency landing in Bengaluru after engine catches fire@AirIndiaX @BLRAirporthttps://t.co/8FWyotoh1v pic.twitter.com/jifx6nQSYh
— ChristinMathewPhilip (@ChristinMP_) May 19, 2024

Comments
Post a Comment