Quality of life : ఢిల్లీ, ముంబై, బెంగళూరుల కంటే కొచ్చి, త్రిసూరే బెటరట

 


పరిస్థితులు, కారణాలు ఏవైనా కానీ ప్రజలు ఇప్పుడు గ్రామాలను వదిలేసి పట్టణాలు, నగరాలకు వలసపోతుండటంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్‌లు ఇప్పటికే పరిమితికి మించి జనాలను మోస్తున్నాయి. 

ఈ జనాభా విస్పోటనాన్ని అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేసి విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ ప్లాన్ కొన్ని చోట్ల వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. సొంతవూరికి, కన్నవారికి, ఆత్మీయులకు దగ్గరగా ఉండేందుకు కొందరు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్’ పేరిట విడుదలైన నివేదిక ఆసక్తి కలిగిస్తోంది. 

జీవనోపాధి కల్పించడం, వలసల ఆకర్షణ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన భారతీయ నగరాలు కొచ్చి, త్రిసూర్‌ల కంటే వెనుకబడి ఉన్నాయని నివేదిక తెలిపింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ పారామీటర్ ప్రతి నగరంలో నివసించడం వల్లే కలిగే ప్రయోజనాలు , ప్రజల శ్రేయస్సు, ఆర్ధిక, ఆరోగ్య ఫలితాలను కవర్ చేస్తుంది. జీవన నాణ్యత ఆధారంగా ర్యాంక్‌లు ఇవ్వాల్సి వస్తే.. భారత ఆర్ధిక రాజధాని ముంబై 915, ఢిల్లీ 883, బెంగళూరు 847, హైదరాబాద్ 882వ స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో కొచ్చి, త్రిసూర్‌లు భారత్‌లోని ప్రధాన నగరాల కంటే మెరుగైన స్థానంలో నిలిచాయి. కొచ్చి 765, త్రిసూర్‌కు 757 ర్యాంకులు లభించడం విశేషం.

జీవన నాణ్యత విషయంలో తక్కువ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ.. మొత్తం మీద ముంబై, ఢిల్లీ, బెంగళూరులు ఇతర భారతీయ నగరాలతో పోలిస్తే మెరుగైన స్థానాలను పొందాయి. ముంబై 427, ఢిల్లీ 350, బెంగళూరు 411వ స్థానంలో నిలిచాయి. ఆక్స్‌ఫర్డ్ ఇండెక్స్‌లో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలవగా.. లండన్ , శాన్‌జోస్, టోక్యో, జపాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  రాబోయే రోజులను పరిశీలిస్తే.. ఈ ర్యాంకింగ్‌లను భంగపరిచే అవకాశం ఉన్న అనేక ప్రపంచ పోకడలు ఉన్నాయని ఇండెక్స్ తెలిపింది. 

అసమాన ఆర్ధిక దృక్పథం, ద్రవ్యోల్ఫణ ఆందోళనలు అనేక దేశాల ఆర్ధిక స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కోవిడ్ 19 మహమ్మారి, పెరిగిన వడ్డీ రేట్లు వంటి అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణస్థిరత్వం సమస్యగా కొనసాగుతోంది. ఇది ఆయా దేశాల్లోని ఆర్ధిక వ్యవస్ధలకు మరింత ముప్పును కలిగిస్తుందని ఆక్స్‌ఫర్డ్ ఇండెక్స్ తన నివేదికలో పేర్కొంది.

నగరాలకు ర్యాంక్ ఇవ్వడానికి ఆర్ధిక శాస్త్రం, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి ఐదు విభాగాలను ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ’ పరిగణనలోనికి తీసుకుంది. ఈ ఐదు కేటగిరీలకు వచ్చిన మార్కులను బట్టి ర్యాంకులు ఇచ్చింది. ఎకనామిక్స్‌కు (30 శాతం), హ్యూమన్ క్యాపిటల్ (25 శాతం),  జీవన నాణ్యత (25 శాతం), పర్యావరణం (10 శాతం), గవర్నెన్స్ (10 శాతం)కు  చొప్పున వెయిటేజ్ ఇచ్చారు. 


Comments