ఇకపై ‘ TS ’ కాదు.. TG.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్

 


2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పదేళ్లుగా కేసీఆర్ హయాంలో పనిచేసిన కీలక అధికారులకు స్థానచలనం కలిగించిన రేవంత్ తన టీమ్‌ను సెట్ చేసుకుంటున్నారు. పాలనాపరంగానూ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా కొద్దిరోజుల క్రితం అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ ’’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

అలాగే వాహనాల నెంబర్ ప్లేట్ల మీద ‘టీఎస్‌’కు బదులు ‘టీజీ’ గా మార్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సైతం పంపింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇక నుంచి తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ వుండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. దీని ప్రకారం.. సీరియల్ నెంబర్ 29ఏ కింద టీఎస్ స్థానంలో టీజీగా సవరణ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలతో ఈ మార్పులు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 

కేంద్రం నిర్ణయం నేపథ్యంలో ఇకపై అధికారిక కమ్యూనికేషన్‌ అంతటా టీజీగా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు , స్వతంత్ర సంస్థలు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని .. జీవోలు, నోటిఫికేషన్లు, రిపోర్టులు, లెటర్ హెడ్‌లలో టీజీ అనే పదాన్ని పేర్కొనాలని సీఎస్ సూచించారు. 

అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలోనూ టీజీ ఉండాలని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు. గతంలో టీఎస్ అని ప్రింట్ చేసిన స్టేషనరీని తొలగించి.. టీజీ పేరుతో పునర్ ముద్రించాలని ఆదేశించారు. ఈ నిబంధనల అమలుపై మే 31 నాటికి జీఏడీకి నివేదిక సమర్పించాలని అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. 




Comments