కళ్లకు తగులుతున్నాయ్ .. పూలు విసరొద్దు : అభిమానుల తీరుపై పవన్ అసహనం


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు పవన్ . దీనిలో భాగంగా శుక్రవారం కైకలూరు నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 

ఈ క్రమంలో పవన్ అభిమానులు , జనసేన కార్యకర్తలు ఆయనపై అభిమానంతో వేదికపైకి పూలు విసిరారు. అయితే అవి నేరుగా ముఖం, కళ్లపై పడుతుండటంతో పవన్ కాస్త అసహనానికి గురయ్యారు. పూలు కళ్లకు తగులుతూ వుండటంతో విసరొద్దని విజ్ఞప్తి చేశారు.  ఈసారి ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని .. భవన నిర్మాణ కార్మికుల పక్షాన తాము గళమెత్తామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఠా కార్మికులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయని.. 430 కేసులు నమోదు చేశారని వెల్లడించారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగకుండానే భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారని.. మన ఆస్తి మనదని 90 రోజులలో రుజువు చేసుకోవాలని అంటున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 


Comments