టీడీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే .. జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

 



తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ కొన్నేళ్లుగా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్‌తో పాటు ‘‘ ఎన్టీఆర్ సీఎం సీఎం ’’అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇతర కీలక నేతలు పాల్గొన్న కార్యక్రమాల్లోనూ జూనియర్ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. 

ఇకపోతే.. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడు , వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో శుక్రవారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కొడాలి నాని ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 

10 మంది ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళితే.. వారిని తన్ని తరిమేస్తున్నారని మండిపడ్డారు. వారిపై దాడులు చేయొద్దని చంద్రబాబు కానీ, లోకేష్ కానీ తమ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదని నాని ఆరోపించారు.  అభిమానులంతా టీడీపీని కష్టపడి గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తొక్కేస్తారని, లోకేష్‌ను అందలం ఎక్కిస్తారని కొడాలి నాని ఆరోపించారు.

టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు వస్తాయని.. సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినవారే, పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారని నాని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్ధతు ఇవ్వాలని ఆయన సూచించారు. 

తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని.. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆరేనని వైసీపీలో వున్నా ధైర్యం చెబుతానన్నారు. ఎన్టీఆర్ కుటుంబం కోసం తాను.. తన కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారని నాని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తనకు రెండు కళ్లు అని కొడాలి నాని స్పష్టం చేశారు. 

Comments