హ్యాట్సాఫ్ డాక్టర్ రవళి .. ‘‘సీపీఆర్’’ గొప్పదనం తెలియజేశావమ్మా

 


విజయవాడలో కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన చిన్నారికి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో .. బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. 

ఈ క్రమంలో మెడ్‌సీ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రవళి నన్నపునేని అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారిని నేలపైనే పడుకోబెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ప్రారంభించారు. డాక్టర్ .. బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడే ఉన్న మరో వ్యక్తిని నోటితో గాలిని పంపమని చెప్పారు. దాదాపు 7 నిమిషాల పాటు శ్రమించగా.. డాక్టర్ రవళి కష్టం ఫలించి ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు.

అనంతరం హుటాహుటిన పిల్లాడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగా అందేలా తలను కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆసుపత్రిలో సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో చిన్నారి పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటల తర్వాత పరీక్షలు చేసి ఆపై ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో వున్నాడు. తమ బిడ్డకు ప్రాణదానం చేసిన డాక్టర్ రవళికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఙతలు తెలియజేశారు. బాలుడికి సీపీఆర్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ సందర్భంగా డాక్టర్ రవళి మీడియాలో మాట్లాడుతూ.. ఘటన జరిగిన రోజున సాయంత్రం తాము కోదాడ నుంచి విజయవాడ వస్తున్నామన్నారు. అయ్యప్పనగర్ ఫస్ట్ రోడ్‌లో వెళ్తుండగా.. బాలుడిని వాళ్ల నాన్న భుజాన వేసుకుని ఏడుస్తూ వెళ్తుంటే తాను కారు పక్కన నిలిపి ఏమైందా అని వాకబు చేసినట్లు రవళి చెప్పారు. కరెంట్ షాక్ కొట్టిందని.. బాబు స్పృహలో లేడని చెప్పారని.. బాబును పరీక్షించగా బ్రీతింగ్ లేదని, పల్స్ కూడా చాలా తక్కువగా వుందన్నారు. 

దీంతో లాభం లేదని.. నడిరోడ్డుపైనే పడుకోబెట్టి సీపీఆర్ స్టార్ట్ చేశానని రవళి తెలిపారు. స్పృహ తప్పిన తర్వాత ఎంత త్వరగా సీపీఆర్ చేశామనే దానిపై రిజల్ట్ ఉంటుందని .. ఐదు నిమిషాలకు పైగా సీపీఆర్ చేసిన తర్వాత బ్రీతింగ్ అందిందని ఆమె వెల్లడించారు. చిన్నారిలో కదలిక వచ్చిన తర్వాత పడమటలో ఉన్న విజయా హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పానని.. వెళ్లేటప్పుడు కూడా కాళ్లు కొంచెం పైకి పెట్టి, మెదడుకు రక్తప్రసరణ బాగా అందే విధంగా తీసుకెళ్లమని చెప్పినట్లు రవళి చెప్పారు. 

షాక్ కొట్టిన వెంటనే బాబు దూరంగా వెళ్లిపడ్డాడని, అందుకే ఆసుపత్రిలో సీటీ స్కాన్ కూడా చేసి అప్పుడే డిశ్చార్జ్ చేశారని ఆమె వెల్లడించారు. ఇంటికి వచ్చిన తర్వాత బాబు తండ్రి తనకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీలయ్యారని పేర్కొన్నారు.  అత్యవసర సమయాల్లో హాస్పిటల్స్ అందరికీ దగ్గరలో ఉండవని.. అలాంటప్పుడు సీపీఆర్ అనేది ఒకటి వుంటుందని, దానితో ప్రాణాలు కాపాడవచ్చనేది ప్రజల్లోకి ఇంకా వెళ్లాలని రవళి తెలిపారు. 

డాక్టర్స్‌కి, పారా మెడికల్ స్టాఫ్ ఒక్కరికే తెలిస్తే సరిపోదని ప్రతిఒక్కరికి తెలియాలని ఆమె కోరారు. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో చేశానని తెలిపారు. స్కూల్, కళాశాల స్థాయి నుంచే సీపీఆర్ గురించి పిల్లల్లో అవగాహన  కల్పించాలని డాక్టర్ రవళి కోరారు. 


Comments