హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన .. అప్రమత్తంగా వుండాలన్న జీహెచ్ఎంసీ

 


గడిచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతోన్న జనం కాస్త సేదతీరారు. ఇప్పటికీ పలు చోట్ల వర్షాలు పలకరిస్తూనే వున్నాయి. మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ వర్షసూచన ఇచ్చింది.

నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం వుందని.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

మరోవైపు.. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించగా.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోగా , నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అకాల వర్షం కారణంగా ధాన్యం తడిచిపోయింది. 


Comments