బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు అస్వస్థత
బాలీవుడ్ బాద్‌షా, సూపర్‌ప్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వచ్చారు షారుక్.
అయితే ఎండ వేడిమి కారణంగా ఆయనకు వడదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. చికిత్స అనంతరం షారుక్ ఖాన్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే తమ అభిమాన నటుడు అస్వస్థతకు గురికావడంతో షారుక్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.
ఇకపోతే.. ఐపీఎల్ 17లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా మరో 38 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
ఇకపోతే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (34), విరాట్ కోహ్లీ (33), మహిపాల్ లామ్రోర్ (32) , కామెరూన్ గ్రీన్ (27) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్డ్ , సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి చేతిలో మరో ఓవర్ ఉండగానే ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45), రియాన్ పరాగ్ (26), హెట్‌మైయర్ (26) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్‌లు తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
33 పరుగులు చేసిన ఆయన ఐపీఎల్‌లో 8 వేల మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.. ఆ తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628)లు ఉన్నారు. శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్ - 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతాను ఢీకొట్టనుంది.
Comments
Post a Comment