" పనిమనిషి మమ్మల్ని బంధించి " : భయానక ఘటనను గుర్తుచేసుకున్న బాలీవుడ్ స్టార్ కిడ్స్

 


బాగా డబ్బున్న వాళ్ల ఇళ్లలో పనిచేసేవారు ఇంటి యజమానులు ఇళ్లలో లేనప్పుడు వృద్ధులను, వారి పిల్లలను బంధించి దొంగతనానికి పాల్పడే సన్నివేశాలను మనం ఎన్నో సినిమాల్లో చూశాం. అలాంటిది సినిమాలు తీసేవారి నిజజీవితంలో ఈ సంఘటనలు జరిగితే.

ప్రముఖ హిందీ చిత్ర నిర్మాతలు అనురాగ్ కశ్యప్, ఇంతియాజ్ అలీల కుమార్తెలు అలియా కశ్యప్, ఇదా అలీలు ఇటీవల తమ చిన్నతనంలో జరిగిన ఓ బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. అలియా తన పోడ్‌కాస్ట్ ‘‘ Young, Dumb & Anxious ’’లో మాట్లాడుతూ..  తమను బంధించి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని వివరించారు. తమ ఇద్దరి తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్లారని.. ఇదా అప్పుడు నాతో పాటు నా ఇంట్లోనే ఉందని అలియా తెలిపింది. నాయనమ్మ, పనిమనిషిగా పనిచేస్తున్న అక్క కూడా అప్పుడు ఇంట్లోనే ఉన్నారని గుర్తుచేసుకుంది.

ఈ సమయంలో పనిమనిషిగా ఉన్న మహిళ నానమ్మను గదిలో బంధించి తనకు , ఇదా నోటికి టేపు వేసి మా చేతులును కుర్చీకి కట్టేసిందని అలియా తెలిపింది. మేమిద్దరం ప్రాణభయంతో ఏడ్చామని.. పనిమనిషి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగలు దొంగిలించిందని చెప్పింది. అయితే అదృష్టవశాత్తూ అలియా తల్లి అనుకోకుండా ఇంటికి తిరిగిరావడంతో అంతా బయటపడ్డారు. ఇది నిస్సందేహంగా భయంకరమైన అనుభవం అయినప్పటికీ .. ఈ సంఘటన గురించి తలచుకున్నప్పుడల్లా నవ్వుకుంటామని అలియా చెప్పింది. 

షేన్ గ్రెగోయిర్‌తో అలియాకు నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కనున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అలియా.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా తన యూట్యూబ్ ఛానెల్‌లో జీవితం, మానవ సంబంధాలపై ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వుంటుంది. 


Comments