మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. ‘గోల్డెన్ వీసా’ ప్రకటించిన యూఏఈ , అసలేంటిది..?

 


మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ‘గోల్డన్ వీసా’ను ఇచ్చింది. దక్షణాది చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూఏఈ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఈ గోల్డెన్ వీసాను ఇచ్చింది. దీంతో మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి విషెస్ తెలియజేస్తున్నారు. మెగాస్టార్ కంటే ముందు రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్ , మోని రాయ్, సంజయ్ దత్, సానియా మీర్జా తదితర ప్రముఖులకు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. 

మెగా కుటుంబంలో ఆయన కోడలు ఉపాసన కామినేని, మేనల్లుడు అల్లు అర్జున్‌లు ఇప్పటికే గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇకపోతే.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. దిగ్గజ నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తెలుగు సినీ రంగంలో పద్మ విభూషణ్ అందుకుంది చిరు మాత్రమే. 

అసలేంటీ గోల్డెన్ వీసా.. యూఏఈ ప్రభుత్వం ఎందుకిస్తుంది :

గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా ఉండేందుకు , నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించే లక్ష్యంతో గోల్డెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ దేశ ప్రభుత్వం. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులకు యూఏఈలో స్థిరపడేందుకు లేదా ఎక్కువ కాలం అక్కడ ఉండటానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. 2019లో అమల్లోకి వచ్చిన ఈ వీసాను 5 నుంచి 10 ఏళ్ల  కాలపరిమితితో జారీ చేస్తారు. 

చిరంజీవి ప్రస్థానం :

కృషి, పట్టుదల , క్రమశిక్షణతో సామాన్య స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా తన ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్, కృష్ణల తర్వాత అంతటి మాస్ హీరోగా జననీరాజనాలను అందుకున్నారు. పౌరాణికాలు, జానపదాలు కనుమరుగు అవుతున్న కాలంలో సాంఘిక చిత్రాల దూకుడు మొదలవుతున్న సమయంలో టాలీవుడ్‌లో మెరుపులా దూసుకొచ్చాడు చిరు. 

స్టైల్, మేనరిజం, డ్యాన్సులతో యువతరాన్ని కట్టిపడేశారు చిరు. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’తో చిరంజీవి సంచలనం సృష్టించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.10 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న చిరంజీవి.. భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడయ్యారు. దేశంలోని ప్రధాన దినపత్రికలు చిరంజీవి క్రేజ్ గురించి చెబుతూ... బిగ్గర్ దెన్ బిగ్‌బీ అనే శీర్షికను పెట్టాయి. తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు మెగాస్టార్. 

70కి చేరువవుతున్నా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు చిరు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా మీనాక్షీ చౌదరి, సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, ఆషిక రంగనాథ్, రావ్ రమేశ్, శుభలేఖ సుధాకర్ , మృణాల్ ఠాకూర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘విశ్వంభర’ను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విశ్వంభరను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


Comments