ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం .. కిక్కిరిసిన రోడ్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయా పార్టీల తరపున రంగంలోకి దిగారు. ఎందుకంటే సినీ పరిశ్రమకు, రాజకీయ రంగానిది విడదీయరాని అనుబంధం కాబట్టి. కొందరు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే, ఇంకొందరు సోషల్ మీడియా ద్వారా తాను అభిమానించే పార్టీకి లేదా వ్యక్తిని గెలిపించాలని స్టేట్‌మెంట్లు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీనటుల సందడి ఎక్కువగా వుంది.
ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, రోజాలు సినీనటులే . నాగబాబు, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, నిఖిల్ , గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, థర్టీ ఇయర్స్ పృథ్వీ , గౌతంరాజు, యాంకర్ శ్యామల తదితరులు నేరుగా ప్రచారంలోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, నాని , సంపూర్ణేష్ బాబు తదితరులు పవన్ కళ్యాణ్‌కు మద్ధతుగా నిలిచారు.
ఏపీ రాజకీయాల్లో సినీగ్లామర్ ఎక్కువగా కనిపిస్తుండగా.. తెలంగాణలో అంతంత మాత్రమే. అయితే ఈ కొరతను తీర్చారు అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు వెంకీ మంగళవారం ప్రచారం నిర్వహించారు.
ఖమ్మంలో వెంకటేష్ నిర్వహించిన రోడ్ షోకు వెంకటేష్ అభిమానులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో వెంకటేష్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
2019లో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటిని.. రామసహాయం రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికిచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఆమె మంచి చెఫ్ కావడంతో గత కొంతకాలంగా ఇన్ఫినిటీఫ్లాటర్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా వుంటున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తన మామ రఘురాంరెడ్డిని గెలిపించాలని ఆశ్రిత ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రచారంలో పాల్గొన్న విక్టరి వెంకటేష్..
— BIG TV Breaking News (@bigtvtelugu) May 7, 2024
ఖమ్మం పట్టణంలో మయూరి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీలో పాల్గొన్న విక్టరి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల యుగంధర్, సీపీఐ, సిపిఎం నాయకులు… pic.twitter.com/FStqs5w571
Comments
Post a Comment