తిరుపతి రోడ్లపై పుష్పరాజ్

 


తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వేంచేసియున్న గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి సోదరిగా గంగమ్మను పరిగణిస్తారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు, నైవేద్యం సమర్పిస్తున్నారు. గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలా గ్రామం నుంచి పుట్టింటి సారె, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు.. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్తులు అందుకుంటారు. 

గంగమ్మ తల్లి జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు పొలిమేర దాటరు.. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు రాత్రుళ్లు ఇక్కడ ఉంకూడదు. గంగమ్మ తల్లి జాతర జరిగే సమయంలో పురుషులు ఆడవారి మాదిరిగా చీర ధరించి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప-2లో హీరో అయిన పుష్పరాజ్ క్యారెక్టర్ ‘మాతంగి’ వేషంలో కనిపించడంతో ఈ జాతర ప్రజల్లోకి బాగా వెళ్లింది. 

గంగమ్మ జాతర నేపథ్యంలో తిరుపతికి చెందిన ఓ యువకుడు మాతంగి గెటప్‌లో జీప్‌పై నగరంలో తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘‘ పుష్పరాజ్ ఆన్ తిరుపతి రోడ్స్ ’’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే .. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 షూటింగ్‌లో బన్నీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ సినిమా వేసిన ముద్ర అలాంటిది. పుష్ప ది రైజ్‌లోని పాటలు, డైలాగ్స్‌కు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫిదా అయిపోయారు. తగ్గేదేలే , పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ డైలాగ్స్ చెప్పి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. 

ఏకంగా రాజకీయ నాయకులు సైతం పుష్ప డైలాగ్స్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారంటే ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పుష్ప-2 కోసం జనం అంతలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 పుష్ప - 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్‌కి జోడిగా నటిస్తున్నారు. జగదీష్ ప్రతాప్ , జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్ , అనసూయ, రావు రమేశ్, అజయ్ ఘోష్, ధనుంజయ్‌, బ్రహ్మాజీలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Comments