ఇంటి నుంచి ఓటేసిన రాజకీయ కురువృద్దులు మన్మోహన్ సింగ్, అద్వానీ, జోషి

 


లోక్‌సభ ఎన్నికలు 2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే (ఓట్ ఫ్రమ్ హోమ్) సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సంగతి తెలిసిందే. వృద్ధులు, దివ్యాంగులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి వంటి రాజకీయ కురువృద్ధులు ఇంటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో గురువారం నుంచి ఓటు ఫ్రమ్ హోమ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 24 వరకు వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని ఈసీ తెలిపింది. దీని ద్వారా ఢిల్లీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి రెండు రోజుల వ్యవధిలో 2,956 మంది ఇంటి నుంచి ఓటేశారు. 

ఓటు ఫ్రం హోమ్‌కు అర్హత ఏంటీ :

85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం వున్న దివ్యాంగ ఓటర్లను ఓటు ఫ్రమ్ హోమ్‌కు అర్హులుగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు దేశంలో 1.73 కోట్ల మంది అర్హులైన వారు వున్నట్లు ఈసీ పేర్కొంది. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది.. 100 ఏళ్లకు పైబడిన వారు 2.18 లక్షల మంది, 40 శాతానికి పైగా అంగవైకల్యం వున్నవారు 88.4 లక్షల మంది వున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

ఓటు ఫ్రమ్ హోంకు దరఖాస్తు విధానం :

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 5 రోజుల్లోపు ఓటు ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. దీని కోసం ఫాం 12 డీ పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి గానీ, సహాయ రిటర్నింగ్ అధికారికి గానీ పంపించాల్సి వుంటుంది. దరఖాస్తులో తప్పనిసరిగా తమ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ రాయాలి. అర్హులైన వారికి ఇళ్లకు అధికారులు వచ్చి దరఖాస్తులను అందజేస్తారు. వీనటిని పూర్తి చేసి 5 రోజుల్లోగా బీఎల్ఓలకు సమర్పించాలి. అనంతరం బూత్ స్థాయి అధికారులు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించి.. వారు ఓటు ఫ్రమ్ హోమ్‌కు అర్హులా , కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. 

అనంతరం ఎన్నికల సిబ్బంది మొబైల్ వాహనంలో ఓటరు ఇంటికి వద్దకు చేరుకుని పోస్టల్ బ్యాలెట్ అందజేస్తారు. ఎన్నికల అధికారులు చెప్పిన ప్రదేశంలో ఓటరు రహస్యంగా ఓటు వేసి తన  ఓటును బ్యాలెట్‌లో వేయాల్సి వుంటుంది. ఆ సమయంలో పోలీస్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులతో పాటు ఓ వీడియో గ్రాఫర్ వుంటారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ఒకరోజు ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ఆర్వో వద్ద భద్రపరుస్తారు. కౌంటింగ్ రోజున ఇతర ఓట్లతో పాటే వీటిని కూడా లెక్కిస్తారు. 


Comments