52.3 Degrees Celsius : మండిపోయిన ఢిల్లీ .. భారతదేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత

 


బుధవారం దేశ రాజధాని ఢిల్లీ భానుడి దెబ్బకు భగభగ మండిపోయింది. దేశ చరిత్రలో ముందు ఎన్నడూ లేనివిధంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతతో రాజధాని వాసులు వణికిపోయారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగించడంతో విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరుకుంది. 

మంగళవారం రెండు అబ్జర్వేటరీలు.. ఒకటి దక్షిణ ఢిల్లీలోని అయానగర్‌లో, మరొకటి ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని రిడ్జ్ వద్ద నమోదైన ఉష్ణోగ్రతలు మునపటి రికార్డులను బద్ధలుకొట్టాయి. అయానగర్‌లో నిన్న 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1988 మే నెలలో ఇదే స్టేషన్‌లో నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటి వరకు అత్యధికం. రానున్న రోజుల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లలో వేడిగాలులు వీచే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఉత్తరాదిలో పరిస్ధితి ఈ విధంగా దక్షిణాదిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణ నెలకొంది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అంచనా వేసిన దానికంటే  ముందే రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉండటం విశేషం. కేరళను తాకిన నాలుగైదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. అయితే  తెలంగాణలో గడిచిన రెండు మూడు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


Comments