‘‘ జానీ ’’ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటేనా : డైరెక్టర్ సుజీత్

 


తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ది విలక్షణ శైలి. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ తన మేనరిజం, ఫైట్స్, డైలాగ్స్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. సినిమాల్లో హీరోగా కంటే తన వ్యక్తిత్వంతోనే ఆయన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన సినిమాలతో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలని తపన పడేవారు. మార్షల్ ఆర్ట్స్, వన్ సైడ్ కాలేజ్ బ్యాగ్స్, ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం , మిడిల్ క్రాఫ్‌తో యూత్‌ ఐకాన్‌గా మారారు. 

ఖుషీ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ శిఖరాగ్రంలో ఉంది. అలాంటి పీక్స్ టైంలో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ అందరికీ షాకిస్తూ.. తన తర్వాతి సినిమా తన స్వీయ దర్శకత్వంలోనే వస్తుందని సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. వందల సినిమాల్లో నటించిన వాళ్లే సొంత డైరెక్షన్ అంటే భయపడే సమయంలో కేవలం ఏడెనిమిది సినిమాలు చేసిన పవన్ మెగాఫోన్ పట్టుకోవడం ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచింది. అందరి సహకారంతో జానీని టేకప్ చేసిన పవన్ భారీ అంచనాల నడుమ 2005 ఏప్రిల్ 25న రిలీజ్ చేయగా సినిమా ఫ్లాప్ అయ్యింది. 

బ్లడ్ క్యాన్సర్ బారినపడిన భార్యను బతికించుకోవడం కోసం కిక్‌ బాక్సింగ్ పోటీలో తలపడే కోచ్ కథే ‘జానీ’. తన సతీమణి రేణూ దేశాయ్‌తో ఆయన కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి బంధం మరింత బలపడి ఇద్దరూ ఒక్కటయ్యారు. రఘువరన్, గీత, లిల్లిట్ దూబే, రజా మురాద్, అలీ, బ్రహ్మాజీ, మల్లిఖార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సూర్య , సత్యప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చోటా కే నాయుడు, శ్యాం పాలవ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేయగా.. రమణ గోగుల సంగీతం అందించారు. 

‘‘ నువ్వు సారా తాగుటమానురన్నో ’’, ‘రావోయి మా కంట్రీకి ’’, ‘‘నారాజ్ గాకుర మా అన్నయా ’’, ‘‘ ఏ చోట నువ్వున్నా ’’ పాటు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన చిట్టిచెల్లెలు సినిమాలోని ‘ఈ రేయి తీయనిది’ పాటను రీమేక్‌ చేయగా.. అది ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఆ రోజుల్లో 250 ప్రింట్లతో రిలీజైన తొలి తెలుగు సినిమా ‘జానీ’ రికార్డుల్లోకెక్కింది. సినిమా ఫ్లాప్ అయినా పవన్ టేకింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. టెక్నికల్‌గా సినిమాను పవన్ కళ్యాణ్ ఉన్నతంగా నిలబెట్టారు. 

ఖుషీ తర్వాత చేసిన సినిమా కావడం, పైగా పవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కడంతో జానీపై భారీ అంచనాలున్నాయి. ఆ రోజుల్లోనే రూ.8 కోట్లకు పైగా రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ మూవీ రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి మెగా ఫోన్ పట్టుకోలేదు. అలాగని ఆయన సినిమా తీస్తానంటే పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు క్యూకడతారు.  ఈ నేపథ్యంలో జానీ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యువ దర్శకుడు సుజిత్. 

కార్తీకేయ నటించిన ‘భజే వాయు వేగం ’ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్ సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటని కార్తీకేయ ప్రశ్నించారు. దీనికి సుజీత్ మరో మాట లేకుండా ‘జానీ’ అని సమాధానం ఇచ్చాడు. ఈ మూవీని తన చిన్నతనంలో అనంతపురం శాంతి సుధా థియేటర్‌లో చూశానని ఇందులో చాలా జెన్యూనిటీ ఉంటుందని సుజీత్ ప్రశంసించారు. జానీ అనే బ్యాండ్ కట్టుకుని తాను సినిమా చూశానని.. వారం పాటు దానిని తీయలేదని, చివరికి అది పెట్టుకునే స్నానం చేసేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. 

కాగా.. పవర్‌స్టార్‌తో సుజీత్ ‘ఓజీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాలో పవర్‌స్టార్ సరసన ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే సినిమా షూటింగ్‌ను చాలా వరకు పూర్తి చేయగా.. పవన్‌కు సంబంధించిన కొంత పార్ట్ మిగిలి ఉంది. రాజకీయాలు, ఎన్నికల్లో పవర్‌స్టార్ బిజీగా ఉండటంతో షూటింగ్‌‌లో పాల్గొనడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగియడంతో జనసేనానికి కాస్త విరామం దొరికినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఓజీని కంప్లీట్ చేసే యోచనలో పవన్ ఉన్నట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. 

Comments