అమ్మ బాబోయ్ : అక్కడ కిలో బెండకాయలు రూ. 650, కిలో కాకరకాయలు రూ. 1000
వృత్తి , ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు .. పరాయి గడ్డపై అడుగుపెట్టినప్పటికీ మన ఆహారాన్ని తినేందుకు, వండుకునేందుకు ఇష్టపడతారు. ఎంత కష్టమైనా సరే ఇందుకు కావాల్సిన పదార్ధాలను సమకూర్చుకుంటూ ఉంటారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రధానంగా అన్నమే తింటుంటారు..
వేడి వేడి అన్నంలో అవకాయ వేసుకుని తిన్న ఆనందం బ్రెడ్డూ, బర్గర్‌లో దొరకవని ఎన్నోసార్లు వారు చెప్పారు. మొన్నామధ్య అమెరికాలో బియ్యం దొరక్క భారతీయులు ఇబ్బందులు పడి సూపర్ మార్కెట్లలో ఎవరికి దొరికినన్ని బియ్యం బస్తాలను వారు కొనేసి ఇంట్లో నిల్వ చేసుకున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం స్పందించి.. భారత్‌పై ఒత్తిడి తెచ్చింది.
అయితే భారత్‌లో దొరికినట్లుగా కిరాణా సామాన్లు విదేశాల్లో తక్కువ ధరకు దొరకవు. ఇటీవల లండన్‌లో స్థిరపడిన ఓ ఎన్ఆర్ఐ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడి మార్కెట్‌లలో .. భారతీయ కిరాణా వస్తువుల ధరల వీడియోలను షేర్ చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన చావీ అగర్వాల్.. లండన్‌లోని ఆహార పదార్ధాల రిటైల్ ధరను భారతదేశంలో ఉన్న రేట్లతో పోల్చుతూ ఈ వీడియో చేశారు.
మనదేశంలో ఉన్న ధరలతో పోలిస్తే వీడియోలో చూపిన ప్రతి వస్తువు ఖరీదు చాలా ఎక్కువ. లేస్ చిప్ ప్యాకెట్ ధర భారత్‌లో రూ.20 అయితే లండన్‌లో దాని ధర రూ.95 .. అలాగే మ్యాగీ న్యూడిల్స్ పెద్ద ప్యాకెట్ లండన్‌లో రూ.300గా ఉంది. పనీర్ రూ.700 ఉండటంతో.. తాను మటర్ పనీర్ కంటే చికెన్ కర్రీ చేసుకోవచ్చని చావీ అగర్వాల్ సెటైర్లు వేశారు.
కూరగాయల ధరలు చూస్తే ఎవరికైనా కళ్లు గింగిరాలు తిరగకుండా ఉండవు. లండన్‌లో భిండి (బెండకాయలు) కిలో రూ.650 ఉండగా.. ఆల్ఫోన్స్ మామిడికాయ ఆరు ముక్కలు రూ.2400, కాకర కాయలు కిలో రూ.1000 పలుకుతున్నాయి. జూన్ 6న షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.
ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు 5.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. లండన్‌లో కాకర కాయలు అమ్ముద్దామని ఒకరంటే.. అసలు లండన్‌కి వెళ్లకూడదు రా బాబు అని మరొకరు కామెంట్ పెట్టారు.

Comments
Post a Comment