అన్ని ‘వుడ్’లు కలిసిన అపురూప దృశ్యం.. ఫోటో వైరల్
ప్రపంచ కుబేరుల్లో ఒకరు , రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో ఇటీవల ఘనంగా జరిగింది. ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్‌లోని జియో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల్లోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
కొన్ని రోజుల పాటు జరిగిన అనంత్ అంబానీ పెళ్లి ఈ జనరేషన్‌లోనే ఖరీదైనదిగా నిలిచింది. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి కుమారుడి పెళ్లికి ముఖేష్ అంబానీ అక్షరాల రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారట. అతిథులకు దేశ, విదేశాలకు చెందిన వంటకాలను వడ్డించడంతో పాటు అత్యంత సన్నిహితులకు ఖరీదైన వాచీలను అందించారు అంబానీ. వీటి ఒక్కో ధర రూ.2 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ వాచీలను ధరించి షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఫోటోలకు ఫోజులిచ్చారు.
భారతీయ చిత్ర పరిశ్రమలోని అన్ని భాషలకు చెందిన నటీనటులు , దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ పెళ్లిలో సందడి చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలోని టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్‌కు చెందిన స్టార్ హీరో హీరోయిన్లు ఒక చోటికి చేరి ముచ్చట్లు పెట్టుకున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు. మహేశ్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార, అఖిల్, జెనీలియా, నమ్రతా శిరోద్కర్‌లు ఓ చోట కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. నయన్ భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
ఇకపోతే.. ఈ ఏడాది గుంటూరు కారంతో విజయాన్ని అందుకున్న మహేశ్.. త్వరలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ కాన్సెప్ట్‌తో వస్తోందట. హాలీవుడ్ రేంజ్‌ను మించి ఈ మూవీలో సన్నివేశాలు ఉండేలా జక్కన్న కసరత్తు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు మేకోవర్ అవుతున్నారు. ఇందుకోసం జుట్టు, గడ్డం బాగా పెంచుతున్నారు. అంబానీ పెళ్లిలో ఈ లుక్‌ను సూపర్‌స్టార్ రివీల్ చేశారు.
Comments
Post a Comment