ధోతీ కాదు.. ప్యాంట్‌లో వస్తేనే అనుమతిస్తాం, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో ఓ రైతుకు ఘోర అవమానం
భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీపడుతున్నా, చంద్రుడి మీదకి అడుగు పెడుతున్నా ఇంకా మన సమాజంలో పేద - ధనిక, అగ్రవర్ణాలు - నిమ్న వర్గాలు, క్లాస్ - మాస్ వంటి అంతరాలు మాత్రం పోవడం లేదు. అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతిరావ్ పూలే వంటి మహనీయులు ఈ వివక్షను తొలగించాలని తమ జీవితాలనే ధారపోశారు. అయినప్పటికీ నేటి కంప్యూటర్ యుగంలోనూ మనదేశంలో ఈ జాడ్యం పోవడం లేదు.
మనిషి వేషభాషలు, వస్త్రధారణను చూసి అంచనా వేయకూడదని.. వారికి గౌరవ మర్యాదల విషయంలోనూ అంతరాలు చూపించొద్దని పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ వీటిని పట్టించుకునే స్థితిలో మన జనం లేరు. తాజాగా ధోతీ ధరించి వచ్చారన్న కారణంతో ఓ రైతన్నను షాపింగ్ మాల్ సిబ్బంది లోపల అడుగుపెట్టనివ్వలేదు. ఇది ఏదో చిన్నాచితకా పట్టణంలోనో, గ్రామంలోనో జరిగిన సంఘటన కాదు. భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఉన్నత విద్యావంతులు, మేధావులు, టెక్కీలు కొలువైన బెంగళూరు నగరంలో .
స్థానిక జీటీ మాల్‌లో సినిమా చూసేందుకు ఓ రైతు, తన కుమారుడితో కలిసి వచ్చారు. మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆ రైతుని అడ్డగించి లోపలికి అడుగుపెట్టనివ్వలేదు. ఆ రైతు ధోతీ ధరించి ఉండటమే దీనికి కారణం, అలా కాకుండా ప్యాంట్ ధరించి వస్తే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రైతు సంఘాల నేతలు భగ్గుమన్నారు.
సదరు రైతుకి, అతని కుమారుడికి క్షమాపణలు చెప్పాలంటూ మాల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దెబ్బకు దిగొచ్చిన మాల్ యాజమాన్యం .. సెక్యూరిటి సిబ్బందితో ఆ రైతుకు, అతని కుమారుడికి క్షమాపణలు చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. కొద్దిరోజుల క్రితం ఇదే బెంగళూరులోని ఘనత వహించిన నమ్మ మెట్రో కూడా ఇలాగే రైతును అవమానించింది. మురికి దుస్తుల్లో ఉన్నారంటూ మెట్రో రైలు ఎక్కేందుకు నో ఎంట్రీ బోర్డు ఎత్తారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో దిగొచ్చిన మెట్రో యాజమాన్యం సదరు రైతుకి క్షమాపణలు చెప్పింది.

Comments
Post a Comment