Bagmati Superfast Express : భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమేంటీ?

 


తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వే శాఖను ఉలిక్కిపడేలా చేసింది. గతేడాది ఒడిషాలో షాలిమార్- కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఇంకా కళ్లెదుట మెదులుతూ ఉండగానే మరో ప్రమాదం జరగడంతో దేశ ప్రజలు షాకయ్యారు. అయితే ప్రయాణికులు గాయాలతో బయటపడటం, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అదృష్టవశాత్తూ ఘోర ప్రమాదం తప్పిందని నిపుణులు అంటున్నారు. మైసూరు నుంచి దర్భాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు కవరైపెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 కోచ్‌లు పట్టాలు తప్పగా.. కొన్ని ఎగిరి ఒకదానిపై మరొకటి పడ్డాయి. భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద స్పందించి సహాయక చర్యలు  చేపట్టారు. ఏసీ కోచ్‌లలోని ప్రయాణీకులే ఈ ప్రమాదంలో గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్శిల్ కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

మెయిన్ లైన్‌లో వెళ్తున్న రైలు ఒక్కసారిగా లూప్‌ లైన్‌లోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా రైల్వే వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ప్రమాద సమయంలో భాగమతి ఎక్స్‌‌ప్రెస్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై దక్షిణ రైల్వే జీఎం మీడియాతో మాట్లాడుతూ.. సిగ్నల్, ట్రాక్ మధ్య మిస్ మ్యాచ్ కావడం వల్లే ప్రమాదానికి కారణమన్నారు. మెయిన్ లైన్‌లోకి వెళ్లేలా సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ట్రాక్ మాత్రం రైలును లైప్ వైపు తీసుకెళ్లిందని, తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై విచారణకు ఆదేశించినట్లు జీఎం వెల్లడించారు. 

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా.. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడం , దారి మళ్లించడం చేసింది. ప్రమాద సమయంలో రైలులో దాదాపు 1360 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వీరిలో 19 మంది గాయపడినట్లుగా ఆయన వెల్లడించారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు. 


Comments