మహారాష్ట్రలో గెలుపెవరిది?
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం మొత్తం చూపు మహారాష్ట్ర మీదే ఉంది. భారత్‌లోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న రాజకీయాలు కూడా ఇందుకు కారణం కావొచ్చు. తమ చిరకాల మిత్రపక్షం శివసేనను రెండుగా చీల్చిన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. పనిలో పనిగా తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలోనూ తిరుగుబాటు తీసుకొచ్చి ఆ పార్టీని కూడా చీల్చింది. ఈ నేపథ్యంలో ఈసారి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈసారి 4,136 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్ గ్రూప్), శివసేన (ఏక్‌నాథ్ షిండే గ్రూప్)లు మహాయుతిగా జట్టుకట్టి పోటీ చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పలు ఆకర్షక పథకాలను ప్రవేశపెట్టి ఓటర్లకు గాలం వేస్తోంది ఈ కూటమి. ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా ఈ కూటమి పక్షాన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు.. శివసేన (ఉద్ధవ్ థాక్రే గ్రూప్), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీలు కలిసి మరోసారి మహా వికాస్ అఘాడిగా బరిలో దిగుతున్నాయి. ఈ ఐదేళ్లలో బీజేపీ చేసిన రాజకీయాలు, శివసేన, ఎన్సీపీ చీలికలను ఈ కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలపై రోజుకోక సర్వే వెలుగుచూస్తోంది. కానీ పోటీ నేపథ్యంలో ఎవరిది విజయం అనే దానిపై కాకలు తీరిన రాజకీయ నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
Comments
Post a Comment