ఎన్నో త్యాగాలు చేశా.. మజాకా సక్సెస్‌మీట్‌లో సందీప్ కిషన్ ఎమోషనల్

 



మజాకా సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని, ఎన్నో త్యాగాలు చేశామని తెలిపారు హీరో సందీప్ కిషన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మజాకా చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 

డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 26కి సినిమా రిలీజ్ అయ్యే వరకు రెండు నెలల్లో 36 రోజుల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. మాకు పండగ, న్యూఇయర్ ఏం లేదని.. తెల్లవారుజామున 4 గంటల వరకు షూటింగ్ చేసేవాళ్లమని సందీప్ కిషన్ గుర్తుచేశారు. ఇలాంటి టఫ్ కండీషన్‌లోనూ అంతా ఆనందంగా పనిచేశారని.. ఏ ఒక్కరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదని ఆయన చెప్పారు. 

డైరెక్టర్ త్రినాథరావు, ప్రసన్నబాబులు ఏం చేశారో బ్లైండ్‌గా చేసుకుంటూ వెళ్లిపోయానని , చాలా ఎంజాయ్ చేశామని సందీప్ కిషన్ పేర్కొన్నారు. పెద్దవాళ్లు , చిన్నపిల్లలు థియేటర్‌కి వెళ్లి హ్యాపీగా నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామని సందీప్ చెప్పారు. తాను వేరే వేరే థియేటర్లకు వెళ్లి చూశానని.. సింగిల్ స్క్రీన్‌లకు వెళ్తానంటే నన్ను వెళ్లనివ్వలేదని, పోలీసుల అనుమతులు కావాలని దయచేసి సింగిల్ స్క్రీన్‌లకు వెళ్లొద్దని చెప్పాడని వెల్లడించారు. 

నేను వెళ్లిన మూడు మల్టీప్లెక్స్‌లకు హౌస్‌ఫుల్స్ పడ్డాయని సందీప్ కిషన్ హర్షం వ్యక్తం చేశారు. థియేటర్ అంతా పగలబడి నవ్వుకున్నారని సినిమాకు పాజిటివ్‌గా, నెగిటివ్‌గా రివ్యూలు ఇచ్చినవారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. మిడ్ వీక్ మధ్యలో సినిమా రిలీజ్ చేసి కొంచెం రిస్క్ చేశామని జనాల్లోకి మా సినిమా బాగానే వెళ్లిందని, ఇంకా వెళ్లాలని సందీప్ కిషన్ అన్నారు. 

కాగా.. మజాకా చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. రావు రమేశ్, అన్షు అంబానీ , మురళ శర్మ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్ర పోషించారు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేశ్ దండా, అనీల్ సుంకర, ఉమేశ్ భన్సాల్ సంయుక్తంగా మజాకాను నిర్మించారు . 

మజాకా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే యూత్‌తో హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం హక్కులు రూ.9 కోట్లు.. ఓవర్సీస్ హక్కులు రూ.కోటి .. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.50 లక్షల మేర అమ్ముడయ్యాయి. మొత్తంగా రూ.10.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. మజాకా లాభాల్లోకి రావాలంటే రూ.12 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువకట్టారు .



Comments