ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ... అధినేతలకు అసమ్మతి సెగ తప్పదా?

 


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికలు జరగనుండగా.. జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు , జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరును తొలుత ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులకు అవకాశం కల్పించారు. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజు పేర్లను ఖరారు చేశారు. దీంతో కూటమి నుంచి ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసినట్లయ్యింది. అసెంబ్లీలో సంఖ్యా బలం రీత్యా వీరి ఎన్నిక లాంఛనమే.

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన కూటమి పార్టీలకు అసమ్మతి నేతల భయం పట్టుకుంది. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి ఆస్తులను పణంగా పెట్టిన వారు, పొత్తుల్లో భాగంగా పోటీ నుంచి తప్పుకున్నవారు ఎమ్మెల్సీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు కాకుండా వేరేవరికో ఎమ్మెల్సీ స్థానాలు ఖరారు కావడంపై మెజారిటీ నేతలు భగ్గుమంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. 

ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నేత వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు ఏదో రకంగా న్యాయం చేస్తారని అంతా భావించారు. కానీ ప్రతిసారి ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మ పేరు ఖచ్చితంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రకటనలు రావడంతో విపక్ష నేతలు సైతం అవాక్కయ్యారు. 

తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో తన అనుచరులు, కార్యకర్తలతో వర్మ సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పదవుల పంపకం అంత సులభం కాదని.. ఈ ఇబ్బందులను తాను అర్ధం చేసుకుంటానని వర్మ తెలిపారు. అధినేత చంద్రబాబు నాయుడుతో తన 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై కలిసి పనిచేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అదేశాలకు తనతో పాటు తన కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కేడర్ కట్టుబడి ఉంటుందని వర్మ స్పష్టం చేశారు.

అయితే వర్మకు ఎమ్మెల్సీ లిస్ట్‌లో పేరు దక్కకపోవడంపై జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్మ చాలా సీనియర్ రాజకీయవేత్త అని.. ఆయన గురించి వారి పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పవన్ కళ్యాణ్ విజయంలో వర్మ కీలకపాత్ర పోషించారని.. ఆయనపై తమకు గౌరవం ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అలాగే వర్మకు సరైన ప్రాధాన్యత దక్కాలని తాము కూడా కోరుకుంటున్నామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక వర్మకు చెక్ పెట్టడానికే పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకున్నామన్న వార్తలపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మకు చెక్ పెట్టాల్సినంత అవసరం తమకు లేదని.. దొరబాబు ఎంతో సౌమ్యుడని, ఆయన మా కుటుంబంలో ఒకరని నాదెండ్ల స్పష్టం చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని .. ఇక్కడ ఎవరికి చెక్ పెడతాం? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని నాదెండ్ల అన్నారు. 

ప్రస్తుతం వర్మ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా మరింత మంది అసమ్మతి నేతల లిస్ట్ చాలా ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. త్వరలోనే వీరందరికీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్ లేదా ఇతర సీనియర్ నేతలు వీరిని బుజ్జగించ వచ్చని అంటున్నారు. అయితే కొద్దిరోజులు  ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


Comments