2047 నాటికి భారతీయులదే హవా : ఉగాది వేడుకల్లో చంద్రబాబు
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడ పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సమస్యల్ని అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
ఉగాదిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని.. ఢిల్లీలోని ఏపీ భవన్, చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌లోనూ అధికారికంగా జరుపుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కళ తప్పిందని.. కూర్చొని మాట్లాడుకునే పరిస్ధితి లేదని, 76 మందికి కళారత్న అవార్డులు, 100 మందికి ఉగాది పురస్కారాలు ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కష్టపడకుండా ఏది రాదని, ఈ విషయంలో అందరూ స్పష్టతత ఉండాలని చంద్రబాబు తెలిపారు.
ఎప్పుడూ హార్డ్ వర్కే కాదు.. స్మార్ట్ వర్క్ కూడా అవసరమని , ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టామని, ఐటీని ప్రమోట్ చేశామని.. ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో చాలా మంది ప్రశ్నించారని చంద్రబాబు గుర్తుచేశారు. సెల్‌ఫోన్ అనేది మన పిల్లలకు వ్యసనం మారితే చాలా సమస్యలు వస్తాయని , సెల్‌ఫోన్‌ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణకు మండల వ్యవస్ధను తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. తాను సీఎం అయిన తర్వాత మళ్లీ గ్రామాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు పాలనను ప్రవేశపెట్టానని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉందని చంద్రబాబు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో ఏ సేవలైనా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.
ఎన్ని ఆర్ధిక సమస్యలున్నా ఈ ఏడాది రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఏఐ టెక్నాలజీతో అసాధ్యాలు సుసాధ్యం అవుతున్నాయని.. మొద్దబ్బాయిలు కూడా ఏఐతో బ్రిలియంట్స్‌గా మారిపోతున్నారని తెలిపారు. ప్రపంచంలో ఏ భాషలో ఉన్న సమాచారాన్ని అయినా మీరు తెలుసుకోవచ్చని సీఎం అన్నారు. తాను ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు చేశానని.. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టుకతోనే ఎవరూ గొప్పవాళ్లు కాలేదని మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి వారు అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని ఆ స్థాయికి చేరుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మార్గదర్శి, బంగారు కుటుంబం, పీ 4, జీరో పోవర్టి వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు.
2047 నాటికి భారతీయులు ఆదాయంలో ప్రపంచంలోనే టాప్‌లో ఉంటారని చంద్రబాబు ఆకాంక్షించారు. అందులో 30 శాతం మంది తెలుగువారు ఉండాలనేది నా కోరిక అని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలను అంది పుచ్చుకున్నానని చంద్రబాబు తెలిపారు.
Comments
Post a Comment