వివేకా హత్య కేసు : సాక్షుల మరణాలపై చంద్రబాబు వ్యాఖ్యలు .. పేర్నినాని కౌంటర్
మాజీ మంత్రి , ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం నడుస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం మరింత దుమారం రేపింది. మిగిలిన సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని డీజీపీని ఆయన ఆదేశించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న అనారోగ్యంతో గత బుధవారం కన్నుమూశారు. వివేకా హత్య జరిగిన రోజు రంగన్న విధుల్లోనే ఉండటంతో ఆయనను కీలక సాక్షిగా దర్యాప్తు అధికారులు చేర్చారు. విచారణ సందర్భంగా పలుమార్లు కోర్టుకు హాజరైన రంగన్న కీలక విషయాలను ప్రస్తావించారు. కీలక సాక్షి కావడంతో రంగన్నకు ప్రభుత్వం గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తోంది. అయితే ఆయన గతేడాది నుంచి ఆస్తమాతో బాధపడుతున్నారు. రెండ్రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రంగన్నను కడప రిమ్స్‌కు తరలించగా కాసేపటికీ అక్కడ చికిత్స పొందుతూ మరణించారు .
ఈ పరిణామాల నేపథ్యంలో రంగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు పోలీసులు. రంగన్న మరణించిన తర్వాత రిమ్స్ వైద్యులు ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దీంతో పులివెందుల బాకరాపురం స్మశానవాటికలో రంగన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణం చుట్టూ చోటు చేసుకున్న అనుమానాలు, రంగన్న భార్య ఆరోపణలపై నిజం తేల్చేందుకు గాను రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు
కడప వైద్యులతో పాటు విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. పులివెందుల పోలసులు, పులివెందుల ఆర్డీవో సమక్షంలో రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. రంగన్న మృతదేహం నుంచి వెంట్రుకలు, కాలిగోళ్లు, చేతిగోళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు . కేసు తీవ్రత నేపథ్యంలో పులివెందులలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
మరోవైపు.. వివేకా హత్య కేసు సాక్షుల మరణాలపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా కేసుపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని నాని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు నాయుడు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నాని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు . వివేకా హత్య కేసులో సాక్ష్యులు అనారోగ్య కారణాలతో చనిపోయారని ఆయన తెలిపారు. రంగన్నకు సీబీఐ విజ్ఞప్తి మేరకు తమ ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిని 1+1కు తగ్గించిందని పేర్ని నాని తెలిపారు. పోలీస్ భద్రతలో ఉన్న రంగన్న అనుమానాస్పదంగా ఎలా చనిపోయారని ఆయన ప్రశ్నించారు.
పరిటాల రవి హత్య కేసులో సాక్షుల మరణాలపై మంత్రివర్గంలో చర్చించడం ఏంటని పేర్నినాని మండిపడ్డారు. పరిటాల రవి సతీమణి సునీత గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని.. మరి అప్పుడు ఎందుకు విచారణ చేయించలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై విషం చిమ్మడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు . మరి దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Comments
Post a Comment