‘ఆదిత్య 369 .. ఆ ముగ్గురికీ రుణపడి ఉంటా’

 

Aditya 369

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భారతదేశపు తొలి సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలన్నతో ఉంటే తమకు షూటింగ్ చేసినట్లు ఉండదని బాబూమోహన్ అన్నారు. 

బాలన్న ఈ సినిమాలో చేసిన రెండు క్యారెక్టర్లు వర్ణనాతీతమని చెప్పారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని బాబూమోహన్ ప్రశంసించారు. తరాలు మారినా ఆదిత్య 369ని కొత్త సినిమాగానే చూస్తారని ఆయన పేర్కొన్నారు. 

ఈ సినిమా తీయడానికి వెనుక దారితీసిన పరిస్ధితులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాకు ఫోన్ చేసి విజయా గార్డెన్స్‌కు రమ్మన్నారని, అర్జెంట్‌గా సింగీతం శ్రీనివాసరావు గారిని కలిసిరా అని చెప్పారని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అర్ధగంట పాటు  నాకు కథ వినిపించారని, టైం మిషన్ , టైం ట్రావెల్ కాన్సెప్ట్ చెప్పారని కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

ఆ తర్వాత తనకు కొన్ని ఇంగ్లీష్ చిత్రాల వీసీడీలు ఇచ్చి చూడమన్నారని.. దానిని భారతీయ నేపథ్యానికి అనుగుణంగా మార్పులు చేశానని శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.  నాకు భయమేసి బాలుగారిని కలిసి టైం మిషన్, టైం ట్రావెల్ అంటున్నారని నాకు భయంగా ఉందని చెప్పానని కృష్ణప్రసాద్ అన్నారు.  ఈ సినిమాను ఫస్ట్ నువ్వు నమ్ము.. ఈ సినిమాతో కొన్ని దశాబ్ధాల పాటు గుర్తుండిపోతావని బాలు ధైర్యం చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. 

ఉదయాన్నే శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి మీరిచ్చిన మూడు సీడీలలో ఒకటి చూశానని.. ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయని చెప్పానని కృష్ణప్రసాద్ అన్నారు. మీరు చెప్పిన పాయింట్ బాగుందని శ్రీనివాసరావుతో చెప్పడంతో ఈ సినిమాకు సంబంధించిన 40 నిమిషాల కథ చెప్పారని తెలిపారు. కృష్ణదేవరాయలు పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే మీతో ఈ సినిమా చేస్తానని సింగీతం శ్రీనివాసరావు అన్నారని శివలెంక వెల్లడించారు. వెంటనే దేవి వరప్రసాద్‌కు బాలుగారు ఫోన్ చేసి బాలకృష్ణ అపాయింట్‌మెంట్‌ను ఇప్పించారని కృష్ణప్రసాద్ అన్నారు. 

అయితే డైరెక్టర్ ఎవరని దేవివరప్రసాద్ అడగటంతో సింగీతం శ్రీనివాసరావు అని బాలు చెప్పారని దాంతో ప్రసాద్ కాస్త కంగారు పడ్డారని శివలెంక తెలిపారు. అయినప్పటికీ వెంటనే బాలయ్య అపాయింట్‌మెంట్ ఇప్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ ఆ సమయంలో కమర్షియల్ సినిమాలతో మంచి ఊపులో ఉన్నారని.. దర్శకులు, కథలు ఆయన కోసం రెడీ అవుతున్నాయని అయినప్పటికీ సింగీతం శ్రీనివాసరావు సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శివలెంక కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. 

సినిమా మొదలుపెట్టాక అంతా నాకు సహకారం అందించారని ఆయన గుర్తుచేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశాక.. వెంకటేశ్, నాగార్జున, నాగేశ్వరరావు వంటి వారు ఏం జరుగుతోందని ఆశ్చర్యపోయారని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సినిమా కోసం పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్‌లాల్ వంటి ముగ్గురు కెమెరామెన్‌లు పనిచేశారని ఆయన తెలిపారు. 

సినిమా రిలీజ్ అయ్యాక నాకు స్పెషల్ బ్రాండ్ వచ్చిందని.. నేను ఎన్నో సినిమాలు తీసినా మీరు ఆదిత్య 369 నిర్మాత అని తెలుసుకుని మెచ్చుకుంటున్నారని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ సినిమా విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింగీతం శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణలకు జీవితాంతం రుణపడి ఉంటానని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. 

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఆదిత్య 369 చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన తొలుత విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ దొరక్కపోవడంతో మలయాళ నటి మోహినిని ఎంపిక చేశారు. టిను ఆనంద్, అమ్రీష్ పురి, సిల్క్ స్మిత, చంద్రమోహన్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, బాబుమోహన్, శ్రీలక్ష్మీ , బాలనటులుగా తరుణ్, రాశీలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. 

మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడిగా అద్భుతమైన స్వరాలు అందజేశారు. ముఖ్యంగా జానవులే నెరజానవులే, రాసలీల వేళ, సెంచరీలు కొట్టే వయసు మాది వంటి పాటలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. సిల్క్ స్మితతో బాలయ్య చేసిన జానవులే సాంగ్ ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. 18 జూలై 1991న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. 

ఆదిత్య 369కి సీక్వెల్ తీయాలని సింగీతం శ్రీనివాసరావు తన మనసులో మాట చెప్పారు. ఈ చిత్రాన్ని బాలయ్యకు బదులుగా ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞతో ఆదిత్య 999 పేరుతో తీస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణ కథ రాయడం విశేషం 


Comments