ఏపీలో స్కీములు లేవు .. అంతా రెడ్ బుక్ ప్రకారమే : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మంగళవారం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సూపర్ సిక్స్‌లు గాలికి ఎగిరిపోయాయని అన్నారు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి , ప్రతి ఇంటికి పాంప్లేట్స్ పంచారని జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఎందరో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసా అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. ఏపీలో దాదాపు 8.6 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని.. మరి సీఎం చెప్పినట్లు ఈ 1.48 కోట్ల కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా అని నిలదీశారు జగన్. చంద్రబాబు ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని.. దీంతో ప్రజలు సీఎం మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసునని.. కానీ కావాలనే ప్రజలను మోసం చేస్తున్నారని.. సూపర్ 6, సూపర్ 7 గురించి ప్రశ్నిస్తే రాష్ట్రం అప్పుల పాలైందని అంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయని.. ఇప్పుడు కొత్తగా పీ 4 అనే మోసాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు జగన్. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అని వైసీపీ చీఫ్ ప్రశ్నించారు.
చంద్రబాబు వేసే ప్రతి అడుగు ఒక మోసమేనని ఆయన పాలన మొత్తం అబద్ధాలే కనిపిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలన రావడానికి ముందు వరకు తన హయాంలో ప్రతి నెలా ఏదో ఒక బటన్ నొక్కి , ఏదో ఒక రూపంలో మంచి జరిగేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రజల్లోకి వెళ్లలేడని, కార్యకర్తలను పంపించలేడని .. ప్రజల వద్దకు పంపించి ఏం మంచి చేశారని చెబుతారని వైసీపీ బాస్ ప్రశ్నించారు.
స్కూళ్లు నాశనం అయ్యాయని, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయిందని, మూడో తరగతి నుంచి పెట్టిన సబ్జెక్ట్ టీచర్ విధానం లేదన్నారు. 8వ తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబ్‌లు ఇచ్చేవాళ్లమని, ఆరోగ్యశ్రీ పడకేసిందని.. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని 11 నెలలకు గాను నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.3500 కోట్లు బకాయిలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దీని కారణంగా నెట్‌వర్క్ హాస్పిటల్స్ .. ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స చేయడానికి సుముఖంగా లేవన్నారు.
104, 108 అంబులెన్స్‌ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని , గవర్నెమెంట్ ఆసుపత్రుల గురించి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదని, రైతు అనేవాడు దళారీలకు అమ్ముడుపోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద జగన్ రూ.13,500 ఇస్తే నేను వచ్చాక పీఎం కిసాన్ యోజన కాకుండా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని జగన్ మండిపడ్డారు.
ఆర్‌బీకేలు నిర్వీర్వం అయ్యాయని, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశాడని , సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీలు వచ్చే దానిని కూడా మూసేశాడని వైసీపీ అధినేత దుయ్యబట్టారు. రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేని పరిస్దితి రాష్ట్రంలో నెలకొందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్ధ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవని .. రాష్ట్రంలో ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమేనని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.
రాజకీయాలలో ఎప్పుడు విలువలు, విశ్వసనీయత ఉండాలని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తినని నేను అలాగే ఉంటాను.. పార్టీ కూడా అలాగే ఉండాలని ఆశించానని జగన్ చెప్పారు. 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి గెలిచే అవకాశం లేని 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారని.. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్ధితి లేక ఎన్నికలు జరిపారని ఈ స్థానాల్లో 39 స్థానాల్లో వైసీపీ కార్యకర్తలు గొప్పగా తెగించి చూపి గెలిచారని జగన్ అన్నారు.
తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎక్కడా కూడా గెలవడానికి నెంబర్స్ లేవని అయినప్పటికీ టీడీపీ ఎన్నికలు నిర్వహించిందని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మనకు బలం లేనప్పుడు హుందాగా వ్యవహరించాలని ఆయన చురకలంటించారు.
Comments
Post a Comment