అలీపై వ్యాఖ్యలు: మీ ఖర్మ, నేను ఇలాగే మాట్లాడతా.. రాజేంద్రప్రసాద్
సీనియర్ నటుడు, నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇటీవలి కాలంలో మైక్ అందుకుంటే చాలు కాంట్రవర్సీ అయిపోతోంది. అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్‌లపై రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో స్వయంగా క్షమాపణలు చెప్పారు. రాజేంద్రప్రసాద్‌కు వయసు పెరుగుతున్న కొద్ది హుందాగా ఉండాలన్న విజ్ఞత ఉండటం లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వేదికపై మైక్ అందుకున్న తర్వాత సభా మర్యాదను పాటించడం నేర్చుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని అసభ్య పదజాలంతో దూషించడంతో రాజేంద్రప్రసాద్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సినీవర్గాల్లో సైతం ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఓ కార్యక్రమంలో హీరోయిన్, నటుడి గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారని.. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానని తేల్చిచెప్పారు.
అన్నయ్య స్థానంలో ఉండి నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.. అది మీ ఖర్మ. నేను ఎప్పుడూ ఇలాగే సరదాగా ఉంటానని రాజేంద్రప్రసాద్ అన్నారు. పెళ్లి పుస్తకం నుంచి షష్టి పూర్తి సినిమా వరకు నా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇన్నేళ్ల అనుభవంలో నేను చేర్చుకున్నవి, నాకు తెలిసినవి అందరికీ చెబుతానని.. నాకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలాంటి పాత్రలే చివరి శ్వాస వరకు చేయాలని అనుకుంటున్నానని .. ఇళయరాజా జన్మదినం నాడు షష్టిపూర్తి సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అయితే వేదిక మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఇందులో రాజేంద్రప్రసాద్, అర్చనలు కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ తర్వాత ఈ సీనియర్ నటులిద్దరూ కలిసి నటించడం 38 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
Comments
Post a Comment