Thug Life Box Office Collection Day 1: థగ్‌లైఫ్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. కమల్ హాసన్ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్

 



నాయగన్ తర్వాత దాదాపు 38 ఏళ్లకు విలక్షణ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్‌ లైఫ్. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు కారణమై కర్ణాటకలో బ్యాన్‌కు గురైంది థగ్ లైఫ్. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తొలిరోజు ఈ భారీ చిత్రం ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది? ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో? చూస్తే:

థగ్ లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెగ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్‌లు దాదాపు రూ.200  కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కమల్ హాసన్ సరసన అభిరామి, త్రిషలు హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలకపాత్ర పోషించారు. అలాగే ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, తణికెళ్ల భరని, మహేశ్ మంజ్రేకర్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఏపీ ఇంటర్నేషనల్, హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ థగ్ లైఫ్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ఆంధ్రా, నైజాం హక్కులను శ్రేష్ట్ మూవీస్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.149.7 కోట్లకు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఆగస్ట్ 7న థగ్‌లైఫ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ విజయ్ టీవీ దాదాపు రూ.60 కోట్లకు దక్కించుకుంది. కేవలం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే థగ్‌లైఫ్ తన పూర్తి పెట్టుబడిని రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

కమల్ హాసన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని  ట్రేడ్ పండితులు విలువ కట్టారు. థగ్ లైఫ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇండియా వైడ్‌ దాదాపు రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.7.5 కోట్లను ప్రీ సేల్స్ ద్వారా సొంతం చేసుకున్న థగ్ లైఫ్ మొత్తంగా అడ్వాన్స్  బుకింగ్ ద్వారా రూ.13.5 కోట్లు ఆర్జించింది. తొలిరోజు కమల్ హాసన్ - మణిరత్నంల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. 


Comments