Kantara: Chapter 1 Updates: కాంతార చాప్టర్ 1 సెట్స్ నుంచి రిలీజ్ వరకు .. ఏం జరిగిందంటే?

 


2022లో వచ్చిన కాంతార ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 407కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా తీరుతెన్నులు మారిపోగా.. కాంతార దానిని మరో మెట్టు పైకెక్కించింది.

కాంతార తారాగణం

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా.. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్, నవీన్ డీ పడిల్, షైన్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతారను నిర్మించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫి, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టిలు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

సెప్టెంబర్ 30, 2022న విడుదలైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కర్ణాటకలో 168 కోట్ల రూపాయలు, ఆంధ్రా - నైజాంలలో 60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, కేరళలో 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 45 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 96 కోట్ల రూపాయలు చొప్పున భారత్‌లో 309 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 363.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 407 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కాంతార చాప్టర్ 1కి శ్రీకారం

కాంతార హిట్ కావడంతో దానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1ని తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కన్నడ నాట ప్రచారంలో ఉన్న జానపద కథలు, ఆధ్యాత్మికత, యాక్షన్, ప్రకృతితో మనిషి సంబంధం కీలక అంశాలుగా తీసుకుని కాంతార చాప్టర్ 1ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. 2023 నవంబర్‌లో ఈ సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది. నవంబర్ 27న కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను రిలీజ్ చేశారు. ఐ మ్యాక్స్, డీ బాక్స్, ఐసీఈ, 4డీఎక్స్, డాల్బీ సినిమా, ఎపిక్ ఫార్మాట్‌‌లో రిలీజ్ చేసే విధంగా కాంతార చాప్టర్ 1 చిత్రీకరణ జరిగింది.

8 నెలల్లో స్క్రిప్ట్ రెడీ

మంగళూరులో కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 తీసేందుకు పంజుర్లి దేవత అనుమతి తీసుకున్నారు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. 8 నెలలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఆయన ఇందుకోసం షానీల్ గౌతమ్, అనిరుధ్ మహేశ్‌ల సహకారం తీసుకున్నారు. కాంతార చాప్టర్ 1లో ప్రధానంగా పంజుర్లి దేవత, గులిగ దేవతల చుట్టూ కథ ఉంటుందని చెప్పారు. భారతదేశానికి ఆంగ్లేయులు రావడానికి ముందు కర్ణాటక ప్రాంతం కాదంబులు, బనవాసి రాజవంశాల పాలనలో ఉండేది. గిరిజనులు, రాజవంశానికి మధ్య జరిగిన యుద్ధాన్ని కాంతార చాప్టర్ 1లో చూపించారు.

కాంతార సెట్‌లో మరణాలు

కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైన నాటి నుంచి పలువురు అనూహ్యంగా మరణించడం కలకలం రేపింది. నలుగురి మరణాలతో పాటు షూటింగ్ స్పాట్‌లో పలు ప్రమాదాలు, దున్నపోతు మృతి వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారింది. కాంతార టీమ్‌ను ఏదో దుష్ట శక్తి వెంటాడుతుందంటూ పుకార్లు వ్యాపించాయి. స్వయంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి సైతం మూడు, నాలుగు సార్లు చావు అంచుల వరకు వెళ్లినట్లు చెప్పారు. అయితే దేవుడి ఆశీర్వాదం వల్ల తాము షూటింగ్ పూర్తి చేసినట్లు రిషబ్ తెలిపారు.

కాంతార నటీనటుల రెమ్యునరేషన్

కాంతార చాప్టర్‌ 1 సినిమాతో పాటు నటీనటుల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కాంతారకు 4 కోట్ల రూపాయలు తీసుకున్న రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1కు మాత్రం రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. దీనికి బదులుగా లాభాల్లో వాటాను తీసుకునేందుకు నిర్మాతలతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారట. ఇక హీరోయిన్ రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, సంయుక్త గౌడలకు తలో కోటీ రూపాయలు రెమ్యునరేషన్ కింద చెల్లించినట్లుగా శాండల్ వుడ్ వర్గాలు తెలిపాయి.

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్:

కాంతార బ్రాండ్ ఇమేజ్ కారణంగా కాంతాఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. దేశ, విదేశాల్లో అనేక బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. కేరళలో హీరో పృథ్వీ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్... నార్త్ ఇండియాలో ఏఏ ఫిల్మ్స్... తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, వారాహి చలన చిత్రం, విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీ సినిమాస్, ఎస్‌కేఎన్ టెలీఫిల్మ్స్... తమిళనాడులో థింక్ స్టూడియోస్‌, ఎం మూవీస్, ఫైవ్‌స్టార్ కే సెంథిల్, ఎస్ పిక్చర్... ఓవర్సీస్‌లో పరాస్ ఫిల్మ్స్, నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్‌‌లు దక్కించుకున్నాయి. కాంతార చాప్టర్ 1 డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియోస సంస్థ 125 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.

నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్‌లో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది కాంతార. కర్ణాటకలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, కేరళలో 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 44.5 కోట్ల రూపాయలు చొప్పున 440 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉంది. 

Comments