మా అమ్మని బతికించి తెస్తారా... ఎవ్వరినీ వదిలిపెట్టను.. నటి హేమ వార్నింగ్


గతేడాది బెంగళూరులో వెలుగుచూసిన రేవ్ పార్టీ కేసు తెలుగు చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. బర్త్ డే పార్టీ ముసులో జరిగిన ఈ యవ్వారాన్ని బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయగా .. వీరిలో తెలుగు నటి హేమ కూడా ఉన్నారు. అయితే ఆ వెంటనే తాను బెంగళూరు పార్టీకి వెళ్లలేదని ఇంట్లో వంట చేసుకుంటున్నానని ఆమె నానాహడావుడి చేసింది.

విచారణకు రావాల్సిందిగా పోలసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న హేమ ఆ తర్వాత బెయిల్‌పై విడుదలవ్వగా.. కేసు విచారణ ఏడాది పాటు కొనసాగింది. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ వివరాల్లోకి వెళితే..

రేవ్ పార్టీలో తాను లేనని తొలి నుంచి బలంగా చెప్పారు హేమ. అయితే ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన విమాన టికెట్లు, సీసీటీవీ, మీడియా ఛానెల్స్‌లో వైరల్ అయిన వీడియోలు తదితర అంశాల ఆధారంగా హేమను నిందితురాలిగా పేర్కొన్నారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లిన మాట వాస్తవమేనని కానీ పార్టీ మొత్తం ఉండకుండా మధ్యలోనే వచ్చేశానని హేమ పేర్కొన్నారు. నా వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్, గోళ్లు ఏం కావాలన్నా ఇస్తానని వీటి ఆధారంగా అసలు నిజం తేల్చాలని సవాల్ విసిరారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో హేమ పేరు రావడంతో ఆమెపై మీడియాలో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిని హేమ ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే కోర్ట్ తుది తీర్పు కోసం ఆమె నిరీక్షించారు.

అయితే రేవ్ పార్టీ కేసు ఆమె వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నిజానిజాలు తెలిసే వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించింది. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో హేమ మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఇంతలో హేమ తల్లి కొల్లి లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆమె మరింత కృంగిపోయారు. తల్లి మరణవార్త తెలియగానే హేమ హైదరాబాద్ నుంచి హుటాహుటిన తన స్వగ్రామం రాజోలు చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించారు.

తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హేమ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు.. ఆ దు:ఖాన్ని గుండెల్లో దాచుకుని గుడ్‌న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను.. బెంగళూరు హైకోర్టు వారు నాపైనున్న కేసును క్వాష్ చేశారు. కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను.. నవంబర్ 3వ తేదీ జడ్జిమెంట్ వచ్చింది. కాకపోతే.. జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను.. ఈలోపు అమ్మకి సడెన్‌గా స్ట్రోక్ రావడం చనిపోవడం జరిగింది అని హేమ చెప్పారు

అమ్మ నా స్ట్రెంత్, నా ధైర్యం. ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. నాకంటూ ఓ ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానెల్స్ వల్ల అమ్మ చాలా కృంగిపోయారు. ఆరోజు నుంచి మీకు అమ్మ గురించి అమ్మకు ఒంట్లో బాలేదని చెప్పాను. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్లకి, ఈ సోషల్ మీడియా వాళ్లకి, ట్రోల్ చేసే వాళ్లకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయి. ఫేక్ న్యూస్ వేయొద్దు, వేయొద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నా ఫస్ట్ నుంచి. ఒక ఫేక్ న్యూస్ వేసేసి దానిని కవర్ చేయడానికి ఎంత కిందకి వెళ్లాలో, అంత కిందకి వెళ్లి న్యూస్ వేస్తూనే ఉన్నారు అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు

నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ చేయొద్దు నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదు. సింహం రెండు అడుగులు వేస్తుందంటే పారిపోతున్నట్లు కాదు.. ఖచ్చితంగా వస్తాను అని అన్నాను. ఈరోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా యందున ఉన్నాడు.. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చచ్చిపోయారు, ఇప్పుడు మీరందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయుంటాను, ఇప్పుడు బతికించి తీసుకొస్తారా? మన:సాక్షి అనేది అంటూ ఒకటి ఉంటుంది, ఎన్నిసార్లు, ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటాను. ఆ దేవుడి దయవల్ల మా అమ్మ దయ వల్ల బతికి బట్ట కట్టాను నేను. లేకపోతే నా పరిస్ధితి ఏంటీ? అందరూ మరిచిపోయారు వదిలేయమని అంటున్నారు అని హేమ గుర్తుచేసుకున్నారు.

ఏడాదిన్నర నుంచి నాలో నేనే మదనపడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను. నా హీరోలు, డైరెక్టర్లు నన్ను ఏమనడం లేదు. కానీ మాట పడింది నేను.. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి, న్యూస్ వేసుకున్న మీరంతా బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకున్నారు. ఫస్ట్ వీడియోని బూతుగా వేశారు. రెండో వీడియో ఆన్‌లైన్‌లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో వేస్తే, నేను ఓవరాక్షన్ చేస్తున్న హేమ. నేను చెబుతూనే ఉన్నాను, నా బ్లడ్ అసలు వీళ్ల దగ్గర లేదు. ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే... ఓవరాక్టింగ్ చేస్తున్న హేమ, బుకాయిస్తున్న హేమ, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన హేమ. నేను ఏమైనా దేశద్రోహం కేసు చేస్తూ దొరికిపోయానా? మనుషులునా మీరంతా? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే.. మీకేం రైట్ ఉందని మా మీద అని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరంతా మంచోళ్లు లాగా, నేను వెదని అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు, ఇప్పుడేం చేస్తారు. ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది హేమ.. హేమ అన్నారు. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నానని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది, ఇప్పుడేమంటారు? నా పరువు తీసుకొస్తారా? ఈ రోజు మ అమ్మ చనిపోయింది.. మా అమ్మను తీసుకురాగలుగుతారా? ఏడాదిన్నర పాటు నరకం అనుభవించా, ఎక్కడికైనా వెళ్తే ఏమనుకుంటారోనని పది చోట్లకు వెళ్లాల్సిన దానిని, రెండు చోట్లకు వెళ్లి వెంటనే తిరిగొచ్చేసే దానిని. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, అందరికీ గుణపాఠం చెబుతానని హేమ వార్నింగ్ ఇచ్చారు. 

Comments