Kasibugga Stampede: ఏపీలో ఘోరం.. తొక్కిసలాటలో 9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనను మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.
నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుని 9 మంది భక్తులు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో శనివారం పెద్ద సంఖ్యలో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment