మొన్న అఖండ 2... నేడు అన్నగారు వస్తారు.. కార్తీ మూవీ రిలీజ్‌‌పై హైకోర్ట్ స్టే

 


సినిమా విడుదలల విషయంలో ఇటీవలి కాలంలో అనేక హైడ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు, ఎరోస్ ఇంటర్నేషనల్‌కు మధ్య గతంలో ఉన్న ఆర్ధిక వివాదం నేపథ్యంలో ఎరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అఖండ 2 విడుదలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.

కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 4వ తేదీ రాత్రి తొలుత తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ రద్దు కాగా.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా, ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే తెల్లవారితే రిలీజ్ ఉండటంతో అప్పటికీ సమస్య పరిష్కారమై అఖండ 2 విడుదల అవుతుందని అనుకున్న బాలయ్య అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. వివాదం పరిష్కారం కాకపోవడంతో అఖండ 2 రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఇరువర్గాలకు రాజీ కుదర్చడానికి టాలీవుడ్ పెద్దలు దిల్‌రాజు, సురేష్ బాబు వంటి వారు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని అఖండ 2 తిరిగి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వివాదం సద్దుమణిగిందో లేదో .. అచ్చం అఖండ 2 తరహాలోనే సమస్యల్లో చిక్కుకుంది వా వాతియర్ (తెలుగులో అన్నగారు వస్తారు). కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మరికొద్దిగంటల్లో రిలీజ్ ఉండగా.. అన్నగారు వస్తారు యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేస్తూ మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో చూస్తే..

అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే పారిశ్రామికవేత్త దగ్గర ఈ చిత్రాన్ని నిర్మించిన స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా.. 10.35 కోట్ల రూపాయల్ని అప్పుగా తీసుకున్నారు. దీనికి వడ్డీతో కలిపి ప్రస్తుతం అది 21.78 కోట్ల రూపాయలు అయ్యింది. దీనిని తక్షణం చెల్లించేలా రాజాకు ఆదేశాలు ఇవ్వాలని అర్జున్ లాల్ ప్రాపర్టీస్‌ వ్యవహరాలు చూస్తోన్న నిర్వాహకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఇదే అంశంపై రాజాకు న్యాయస్థానం అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు.

దీనిని పరిగణనలోనికి తీసుకున్న మద్రాస్ హైకోర్ట్.. బాకీ చెల్లించే వరకు అన్నగారు వస్తారు చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని స్టే విధించింది. దాంతో కార్తీ సినిమా విడుదలపై సందిగ్ధం నెలకొంది. అన్నగారు వస్తారు చిత్రం రిలీజ్‌కు మరికొద్దిగంటలే సమయం ఉండటంతో ఆ లోగా జ్ఞానవేల్ రాజా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

వా వాతియర్ (తెలుగులో అన్నగారు వస్తారు) సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాలో కార్తీ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్, రాజ్‌కిరణ్, నిల్‌గళ్ రవి, అనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేశ్ తిలక్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా, వెట్రే కృష్ణన్‌ ఎడిటింగ్ బాధ్యతు నిర్వర్తించారు. 

Comments