తండ్రి బాటలో... ఏఎన్ఆర్ కాలేజీకి అక్కినేని నాగార్జున భారీ విరాళం

 


తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా వెలుగొందారు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. సినిమాలతో పాటు పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. మద్రాస్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే సమాజానికి వీరిద్దరూ ఎంతో సేవ చేశారు. తుఫానులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వయంగా జోలె పట్టె, ఊరూరా తిరిగి విరాళాలు సేకరించి ప్రజలకు అందజేసి వారిని ఆదుకున్నారు. తెలుగు ప్రజలకు ఎప్పుడు? ఏ కష్టం వచ్చినా ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ముందుండేవారు. వారు చూపిన బాటలోనే ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఫాలో అవుతోంది. 

ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచి చదువంటే ఎంతో ఇష్టం. కానీ వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెద్దగా చదువుకోలేకపోయారు. తాను ఎదుర్కొన్న కష్టాలు తన పిల్లలు పడకూడదని తన పిల్లల్ని బాగా చదివించారు. అలాగే పేదరికం కారణంగా తనలాగా ఎవ్వరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ స్థాపనలో కీలకపాత్ర పోషించడంతో పాటు దానికి భారీగా విరాళాలు అందించారు. 

ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దేశ, విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ విద్యా నిలయం స్థాపించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే డైమండ్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. డిసెంబర్ 16, 17,18 తేదీలలో వజ్రోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఏఎన్ఆర్ కుమారుడు అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు భారీ విరాళం ప్రకటించారు.

గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు  కాలేజికి 75 సంవత్సరాలు, హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50 ఏళ్లు, నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇండియాకు పదేళ్లు పూర్తవుతోంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఏఎన్ఆర్ కాలేజీ 75 సంవత్సరాల వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉండటమే కాదు... చాలా గర్వంగా ఉంది. మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనుల్లో ఏఎన్ఆర్ కాలేజీ ఒక ఎగ్జాంపుల్ అని నాగార్జున అన్నారు. 

తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్ ఉండాలని 1959లో.. నేను పుట్టిన సంవత్సరంలో ఆయన లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి సినిమాకి 5 వేల నుంచి 10 వేల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే వచ్చేది. కానీ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజీ ఒక్కదానికే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీకి ఒక 25 వేలు, మరో పాతికవేలు మరో యూనివర్సిటీకి, మద్రాస్ యూనివర్సిటీకి మరో  25 వేలు ఇచ్చారు  అని నాగార్జున గుర్తుచేసుకున్నారు

ఆయనకి చదువంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి వేలాదిమందికి బంగారు భవిష్యత్ కల్పించాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజీ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. జస్టిస్ దేవానంద్ గారు, యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ గారు, కావూరి సాంబశివరావు, యలమంచిలి శివాజీ గారు, రామోజీరావు గారు, పద్మనాభం గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు ఇలా ఎంతో మంది చదువుకున్నారు. వీరే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఏఎన్ఆర్ కాలేజీ విద్యార్ధులు మంచి పొజిషన్‌లో ఉన్నారు  అని నాగార్జున ఎమోషనల్ అయ్యారు.  

ఏఎన్ఆర్ కాలేజ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. రేపు నారా లోకేష్ గారు ఇక్కడికి వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.. ఆయన వచ్చినప్పుడు మేనేజ్‌మెంట్ వాళ్లు ఆయనకి ఇది చెప్పి దీనిని పెద్ద ఎత్తున చేయాలని, ఎమ్మెల్యే రాముగారు దీనికి తోడ్పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిచిన కమిటీకి చాలా థ్యాంక్స్. నా తరపున, మా అక్కయ్య నాగ సుశీల, మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్‌షిప్ పెట్టాలని అనుకున్నాం. దాని కోసం 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏఎన్ఆర్ కాలేజీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతాం  అని నాగార్జున తెలిపారు. 

నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు.. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వకపోతే బాగుండదు. ఇంట్లో బయల్దేరేముందు పిల్లలు, అమల మీ అందరికీ హల్ చెప్పమన్నారు. ఒట్టి చేతులతో వెళ్తారా? ఏమైనా తీసుకెళ్తారా? అని అడిగారు. ఈ డొనేషన్ రేపు మీ కాలేజీకి అందజేస్తాం. ఇంత ప్రేమ, ఇంత అభిమానానికి చాలా థ్యాంక్స్ అని నాగార్జున పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాగార్జున మంచి మనసుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


Comments