ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ పేరు మార్పు... కొత్త పేరు ఇదే

 


ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తేలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు, కొత్తగా భారత న్యాయ సంహితతో పాటు బ్రిటీష్ కాలం నాటి వలస వ్యవస్థలు, వాటి పేర్లు, విధానాలను పూర్తిగా మార్చేస్తోంది. తాజాగా మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది ప్రధానులు సేవలందించిన, భారతదేశ పరిపాలనకు గుండెకాయలా భాసిల్లుతోన్న న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) పేరు మార్చింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తోన్న పీఎంవో నూతన భవన సముదాయానికి సేవా తీర్ధ్ అని నామకరణం చేస్తున్నట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెంట్రల్ విస్టా కాంప్లెక్స్‌లో పీఎంవోతో పాటు కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి వంటి అత్యున్నత స్థాయి కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అలాగే పలు దేశాధినేతలు మనదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఇండియా హౌస్‌ను కూడా ఈ కాంప్లెక్స్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు.

దీనితో పాటు రాష్ట్రాల్లో గవర్నర్ల అధికారిక నివాసంగా వ్యవహరిస్తోన్న రాజ్‌భవన్ పేర్లను లోక్‌భవన్‌లుగా మార్చాలని సూచించింది. భారతదేశంలో వలసవాద గుర్తులను చెరిపివేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూచించింది. కేంద్రం సూచన మేరకు ఇప్పటికే కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలు తమ రాజ్‌భవన్‌ పేర్లను లోక్‌భవన్‌గా మార్చాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఉన్న గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా పేరు మార్చారు. రాజ్‌భవన్‌కు పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. 

Comments