అఖండ టూ డాకు మహారాజ్‌... బాలయ్య వసూళ్ల విధ్వంసం, 4 సినిమాలకు ఎన్ని కోట్లంటే?

 


టాలీవుడ్ సీనియర్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస హిట్స్‌తో పాటు ఒకదాని వెంట మరో సినిమాను రిలీజ్ చేస్తున్నారు బాలయ్య. తన నుంచి ఖచ్చితంగా ఏడాదికి ఒక సినిమా వచ్చేలా చూసుకుంటున్నారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్‌లతో వరుస విజయాలను అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు తాజాగా అఖండ 2తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా వస్తోన్న సినిమా కావడంతో అఖండ 2 మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు నెలకొన్నాయి. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉండగా.. బాలయ్య బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఆయన నటించిన చివరి నాలుగు చిత్రాలు అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్‌లు 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏ చిత్రం ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

బాలయ్య విధ్వంసం అఖండతో ప్రారంభమైంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 డిసెంబర్ 2న విడుదలైంది. 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కగా... 53 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కరోనా సమయంలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మరోసారి థియేటర్ల వైపు నడిపించింది. అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 133 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ లాభాలను అందించింది.

అఖండ విడుదలైన రెండేళ్లకు 2023 అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు 67 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు కీలకపాత్ర పోషించారు. భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అనంతరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన చిత్రం వీరసింహారెడ్డి, 2023 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి 85 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. వరల్డ్ వైడ్‌గా వీరసింహారెడ్డికి 73 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 134 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

హ్యాట్రిక్ విజయాల తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం డాకు మహారాజ్. శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్‌లు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. డాకు మహారాజ్‌కు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అవ్వగా.. వరల్డ్ వైడ్‌గా 82 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ ఏడాది జనవరి 12న వచ్చిన డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 133 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 

అలా బాలయ్య చివరి నాలుగు చిత్రాలు కలిపి 540 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. దాంతో అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారిగా ఈ చిత్రం 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అఖండ 2 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. అదే జరిగితే బాలయ్య కెరీర్‌లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు అవుతుంది. అయితే హిట్ టాక్ వస్తే అఖండ 2 మూవీ ఈ టార్గెట్‌ను ఛేదించడం పెద్ద కష్టం కాదని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Comments