ఏదో ఒకనాడు సీఎం అవుతా.. అందరి లెక్కలు తేలుస్తా: కల్వకుంట్ల కవిత

 


బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇటీవల బీఆర్ఎస్ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటరిచ్చారు. దీనిలో భాగంగా డిసెంబర్ 12 శుక్రవారం నాడు హైదరాబాద్‌లో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా నేను చేస్తున్న పర్యటనలతో అక్రమాల పుట్టలు కదులుతున్నాయి, వాళ్ల పాపాల పునాదులు కదులుతుండటంతో నా మీద దాడి ప్రారంభించారని కవిత మండిపడ్డారు. నేను కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదుర్చుకుని మాట్లాడుతున్నానని, ఆర్ధిక ప్రయోజనాల కోసం నేను పనిచేస్తున్నానని ఆరోపిస్తున్నారు. నేను ఎప్పుడైతే జాగృతి - జనం బాట అని మొదలుపెట్టానో అప్పటి నుంచే దాడి మొదలైందని కవిత అన్నారు.

ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. నా భర్త అనిల్ కుమార్, ఏవి రెడ్డి అనే వ్యాపారవేత్తతో ఏదో లాండ్ డీలింగ్ చేశారని.. దాని వల్ల నాకు పెద్ద ఎత్తున ఆర్ధికంగా ప్రయోజనం జరుగుతోందని, నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్న గుంట నక్కలందరికీ చెబుతున్నా.. నేనింకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేశానని.. అప్పుడే ఇలా భయపడితే ఎలా? రేపటి నుంచి టెస్ట్ మ్యాచ్ ఉంది. ఇప్పటికే అందులో గెలిచాం. మీరు అధికారంలో ఉన్న పదేళ్లలో నా భర్త ఏదైనా పని చేసి పెట్టమని అడిగాడా? కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీశ్ రావు గారితో కానీ.. నా భర్త కానీ, నేను కానీ ఏమైనా ఫేవర్ తీసుకుని ఉంటే దమ్ముంటే చెప్పాలని కవిత సవాల్ విసిరారు.

ఉరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీ వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసిన ఆరోపణలకు దమ్ముంటే జవాబు చెప్పండి. అంతేకానీ నా మీద మొరిగేవాళ్లని వదిలిపెట్టి, ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోను. నేనేం తప్పు చేయలేదు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలన్నీ నా మీద ఆపాదించాలని చూస్తే ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి, నిజాయితీ నా వైపు ఉన్నాయి కాబట్టే నేను ధైర్యంగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతున్నాను. నాకు ఎవ్వరితోనూ అండర్ స్టాండింగ్ లేదు.. ఎవ్వరితోనూ వ్యాపారాలు లేవని కవిత స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేను, నా భర్త ఒకటే అనుకున్నాం.. అమెరికా నుంచి 2004లో మేం వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా? మీలాగా మంది మీదపడి దోచుకోలేదు. వసూళ్లు చేసుకుని ఉద్యమాలు నడపలేదు.. సమయం, సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదువపెట్టి బతుకమ్మ చేశా. అందుకే ఇంత పౌరుషం నాకు.. ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎవరెవరి దగ్గర దోచుకున్నారు. ఏయే స్టూడియోల దగ్గరికి పోయి ధర్నాలు చేసి వాళ్లతో కాంప్రమైజ్ అయ్యారు. అన్ని కథలు నాకు తెలుసు.. కానీ చెప్పలేను. మీరు నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టా లేదు నా దగ్గర అని కవిత వార్నింగ్ ఇచ్చారు.

నా భర్త ప్రైవేట్ భూమిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.. ఎన్నడూ ప్రభుత్వ భూమి జోలికి వెళ్లలేదు, ప్రజలకు నష్టం కలిగించేలా ఒక్క రూపాయి పని కూడా మేం చేయలేదు. జనంలోకి వెళ్తున్న నన్ను డిస్ట్రబ్ చేద్దాం, మైండ్ కరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే చూస్తూ ఊరుకోను. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ విషయంలోనూ సంబంధం లేదు. నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేశారు. ఐదేళ్లు మాత్రమే నేను పవర్‌లో ఉన్నా.. ఆ సమయంలో ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్.. నా ట్విట్టర్, నా క్యాలెండర్ చూసుకోండి. అప్పుడు కూడా మన ఊరు - మన ఎంపీ పేరు పెట్టుకుని నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. పైరవీలు ఏనాడూ చేసుకోలేదు.. నేను చాలా గర్వంగా ఫీలయ్యా. నేను తెలంగాణ నుంచి మొదటి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లా. మేం ఢిల్లీలో కొట్లాడుతుంటే మీరు ఏసీ ఆఫీసుల్లో ఉండి కేసీఆర్ గారి నీడన చేరి ప్రజల సొమ్ము చేరింది కాకుండా నా మీద వెకిలి ప్రయత్నాలు చేస్తూ ఒక్కొక్కొడికి కాళ్లు విరగ్గొడతానని కవిత హెచ్చరించారు.

నా భర్తపై ఆరోపణలు చేయడంతో పాటు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి. ఇంత చేస్తున్న కళ్లు చల్లబడటం లేదా? పార్టీలో నుంచి వెళ్లగొట్టారు ఇంకేంటి. కాంగ్రెస్ పార్టీ భూముల్ని ధారాదత్తం చేస్తుందని అంటున్నారు.. అసలు ఇలాంటి దానికి బీజాలు వేసింది ఎవరు? లీజుకు ఇచ్చిన భూముల్లో ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టించాలి. హాస్పటల్స్ కట్టాలి, స్కూల్స్ కట్టాలి. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటప్పుడు కేటీఆర్ గారు ఎలా సంతకం చేశారు. మీరు కిటికీలు తెరిచారు. ఈ గవర్నెమెంట్ దర్వాజాలు తెరిచింది దోచుకుని తినమని. నా మీద, నా భర్త మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విష ప్రచారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మీకు చూపించానని కవిత తెలిపారు.

దేవుడి దయ వల్ల ఏదో రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను కదా .. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని అన్యాయాలపై నేను ఆరా తీస్తాను. తప్పు చేస్తే నేనే క్షమాభిక్ష కోరతా. ఇప్పటికే జనం బాటలో క్షమాపణలు కోరాను. నేను అస్సలు మంచి దానిని కాదు.. కేసీఆర్ గారంత ఓపిక నాకు లేదు. నన్ను ఒకటి కొడితే రెండు కొడతా. ఎంపీ క్యాండిడేట్‌గా డిక్లర్ చేయండి.. ఎక్కడ ఓడిపోయానో అక్కడే ప్రజల ప్రేమ గెలుచుకుంటానని చెప్పాను. బలవంతంగా ఎమ్మెల్సీ కట్టబెట్టారు. నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పార్టీ సహకారం లేదు. 

Comments