Naa Anveshanaకు నిరసన సెగ...అన్వేష్‌కి బిగుస్తోన్న ఉచ్చు
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై ప్రముఖ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి తదితరులు కౌంటర్ వేశారు. ఆ తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లడంతో శివాజీ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మహిళా కమీషన్ ఎదుట విచారణకు సైతం ఆయన హాజరయ్యారు.
ఆడపిల్లలు నిండుగా వస్త్రధారణ చేసుకోవాలన్నదే తన ఉద్దేశమని.. అంతకుమించి వేరే ఇంటెన్షన్‌తో తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి నేటి వరకు శివాజీకి, అనసూయకి సపోర్ట్ చేస్తూ నెటిజన్లు, సినీ ప్రముఖులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు ఎవరి వెర్షన్‌కి తగ్గట్లుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వివాదంలోకి యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ దూరడంతో అది మరింత రచ్చకు దారి తీసింది.
నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానెల్‌తో ప్రపంచంలోని పలుదేశాలకు చెందిన విశేషాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన విధానం గురించి చెబుతూ మంచి పాపులర్ అయ్యాడు అన్వేష్. అయితే ఇటీవల శివాజీ - అనసూయ వివాదంపై అన్వేష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావులపై అన్వేష్ అసభ్యపదజాలంతో దూషించాడు. అలాగే హిందూ దేవతలపైనా అసభ్యకరంగా మాట్లాడాడు.
దాంతో అన్వేష్‌పై సాంప్రదాయవాదులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అతనిపై తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అన్వేష్‌పై కేసులు నమోదయ్యాయి. తాజాగా సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి కూడా అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. మరోవైపు.. అన్వేష్‌పై అతని ఫాలోవర్లు కూడా సీరియస్ అవుతున్నారు. అతని యూట్యూబ్ ఛానెల్‌తో పాటు సోషల్ మీడియాలో అతనిని అన్ సబ్‌స్క్రైబ్ కొట్టేస్తున్నారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ క్షమాపణలు చెప్పినా జనం మాత్రం శాంతించడం లేదు.

Comments
Post a Comment