రంజాన్‌ నెలలో బిర్యానీయే రారాజు.. ఏకంగా 60 లక్షల ఆర్డర్లు, హైదరాబాదే టాప్

 



ఆనందం, సంతోషం, దు:ఖం, బాధ, గెలుపు, ఓటమి, శుభకార్యం, అశుభకార్యం, వేడుకలు, పండుగలు ఇలా ఎలాంటి కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా బిర్యానీ వుండాల్సిందే. అంతగా భారతీయుల మెనూలో బిర్యానీ అంతర్భాగమైంది. మనదేశంలో ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో వున్నాయి. వీటిలో దేని రుచి దానిదే. హైదరాబాద్ బిర్యానీ, లక్నో బిర్యానీ సహా ఎన్నో వెరైటీలు భోజన ప్రియులకు పసందైన విందును అందిస్తున్నాయి. 

ప్రతి ఏటా బిర్యానీ తినే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి వూరిలోనూ బిర్యానీని అందించే రెస్టారెంట్స్, హోటల్స్ వెలుస్తున్నాయి. తాజాగా ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం, పర్వదినం సందర్భంగా బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. 

Also Read : loksabha elections 2024 : లోక్‌సభ ఎన్నికల బరిలో ఇందిర గాంధీ హంతకుడి కొడుకు

భారతదేశ వ్యాప్తంగా ఒక్క నెలలోనే 60 లక్షల ప్లేట్ల బిర్యానీ కోసం ఆర్డర్లు వచ్చినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. సాధారణ నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం ఎక్కువని వెల్లడించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 వరకు అందిన ఆర్డర్ల ఆధారంగా స్విగ్గీ ఈ జాబితాను విడుదల చేసింది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ .. బిర్యానీ ఆర్డర్ల విషయంలో ప్రత్యేకతను చాటుకుంది. రంజాన్ నెలలో ఒక్క భాగ్యనగరం నుంచే దాదాపు 10 లక్షల ఆర్డర్లు అందాయట. బిర్యానీత పాటు 5.3 లక్షల హలీమ్ ప్లేట్లను డెలివరీ చేసినట్లుగా స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు 34 శాతం పెరిగినట్లు తెలిపింది. చికెన్ బిర్యానీ, సమోసా, హలీమ్ కోసం ఆర్డర్లు ఎక్కువగా వచ్చినట్లు వెల్లడించింది. 



Comments