చంద్రబాబు కీలక నిర్ణయం .. ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్ధుల మార్పు , ఉండి నుంచి రఘురామ

 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను మారుస్తున్నట్లు టీడీపీ ఆదివారం ప్రకటించింది. అవి ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాలు. ఉండి అభ్యర్ధిగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరికి పాడేరు, బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల, ఎంఎస్ రాజుకు మడకశిర, కురుగొండ్ల రామకృష్ణకు వెంకటగిరి టికెట్లు ఖరారు చేశారు. 

అనంతరం తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. ఉండి నుంచి రఘురామకు అవకాశం కల్పించడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును నర్సాపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా వున్న మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మీకి పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించారు చంద్రబాబు. 

Also Read : ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?

పెందుర్తి అసెంబ్లీ స్థానాన్ని గతంలో జనసేనకు కేటాయించడంతో సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి నిరుత్సాహపడ్డారు. దీంతో ఆయనకు తాజాగా మాడుగుల టికెట్ కేటాయించారు చంద్రబాబు. పాడేరు టికెట్‌ను తొలుత వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా.. ఇక్కడ మార్పు చేసి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకశిరలో సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు. వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు కేటాయించారు. కానీ తాజా మార్పుల్లో భాగంగా రామకృష్ణనే అభ్యర్ధిగా నిలబెట్టారు చంద్రబాబు. 

అంతకుముందు .. ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్ధులకు చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీ ఫారాలు అందజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన.. అనంతరం బీఫారాలు అందజేశారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా అభ్యర్ధులకు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 


Comments