ఓట్ల కోసం కాదు .. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నాం : బండి సంజయ్

 


కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము మోడీ ప్రధాని అంటూ ఓట్లు అడుగుతున్నామని, మరి కాంగ్రెస్ ఎవరినీ చూపించి ప్రజలను అభ్యర్ధిస్తుందని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాదు.. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు.

బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే, కాంగ్రెస్ వాళ్లు గుడిని గుడిలోపలి లింగాన్ని మింగే రకమంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజల కోసం తాము పోరాడితే.. మీరు కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. బరిలో దింపడానికి అభ్యర్ధులు దొరక్క.. ప్రజలకు తెలియని అభ్యర్ధిని పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. 

Also Read : పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము.. వీటికి దూరంగా వుండండి : కేడర్‌కు జనసేన కీలక సూచనలు

కరోనా సమయంలో తాము ప్రజల కోసం తిరిగామని.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తాను పోరాడానని ఆయన వెల్లడించారు. ఆసరా పెన్షన్లు ఎవరి ఖాతాలోనూ పడలేదని.. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు 2500 ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. ఆ పార్టీలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్‌కు కూడా పుట్టగతులు వుండవని ఆయన హెచ్చరించారు. 

కాంగ్రెస్‌లో మంత్రి, కేటీఆర్ మంచి దోస్తులని.. ఒకవేళ వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ లేకుంటే బతుకమ్మ చీరల స్కాంపై విచారణ చేయించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్లేనని.. బీఆర్ఎస్‌కు అసలు వేసేవారే లేరని ఆయన ఎద్దేవా చేశారు. 



Comments