నాలుగు స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టో .. సలహాలు పంపిన వారికి థ్యాంక్స్ : నరేంద్ర మోడీ

 



బీజేపీ మేనిఫెస్టో కోసం యావత్ దేశం వేచిచూసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం తీవ్రంగా కృషి చేసిందని ప్రశంసించారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం సలహాలు, సూచనలు పంపిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

కీలకమైన నాలుగు స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టోను తయారు చేశామని .. అవి గరీబ్, యువశక్తి, అన్నదాత, నారీశక్తి అని ప్రధాని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుండటం సంతోషంగా వుందని మోడీ తెలిపారు. ఉద్యోగ కల్పన, స్టార్టప్‌లకు మద్ధతు, మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ రంగాల్లో గ్లోబల్ సెంటర్ల ఏర్పాటుపై మేనిఫెస్టోలో దృష్టి సారించామని ప్రధాని వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి రక్షించామని మోడీ తెలిపారు. 

Also Read : నాలుగు స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టో .. సలహాలు పంపిన వారికి థ్యాంక్స్ : నరేంద్ర మోడీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని నడ్డా ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లు కూడా దీనిని కొనసాగిస్తామని.. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ముందుకెళ్తామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లు ఎలా పనిచేస్తామనే దానిని తమ మేనిఫెస్టో చెబుతోందని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో రూపకల్పన కోసం దాదాపు 15 లక్షల సూచనలు అందాయన్నారు. మోడీ హామీలను ప్రజలు 24 క్యారెట్ల బంగారంలా భావిస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం వంటి అంశాలను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 


Comments