నాకు అనుభవం ... పవన్‌కు పవర్ , అగ్నికి వాయువు తోడైనట్లే : చంద్రబాబు


 


తనకు అనుభవం వుంది.. పవన్‌కు పవర్ వుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకునిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైందని.. ప్రజాగళానికి , వారాహి తోడైందని ఆయన వ్యాఖ్యానించారు. సైకిల్ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదని చంద్రబాబు అన్నారు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయని.. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ చీఫ్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ అని.. అక్రమాలను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ నిలబడ్డారని ప్రశంసించారు. వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ నిలబడ్డారని.. చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని పవన్ చెప్పారని చంద్రబాబు తెలిపారు. మూడు పార్టీలు కలిశాయి.. వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని ప్రశ్నించారు. 

యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారని.. రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసి అప్పుల పాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అప్పులపాలై వెంటిలేటర్‌పై వుండే పరిస్ధితి వుందని .. ఇలాంటి వేళ ఏపీకి ఎన్డీయే ఆక్సిజన్‌గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకోవాలని.. పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

రాష్ట్రానికి కేంద్రం మద్ధతు అవసరమని.. తద్వారా శిథిల రాష్ట్రాన్ని గాడిన పెట్టగలుగుతామన్నారు. విధ్వంస పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా, సంక్షేమ పాలన కావాలి.. సంక్షోభ పాలన కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆస్తులకు రక్షణ కావాలా.. భూమాఫియా కావాలా అని ఆయన నిలదీశారు. దారుణమైన రోడ్లు కావాలా.. రహదారి భద్రత కావాలా అని ప్రశ్నించారు. 10 ఇచ్చి 100 దోచేసేవారు కావాలా.. సంపద పెంచే కూటమి కావాలా అని చంద్రబాబు నిలదీశారు. 

ధరల బాదుడు కావాలా.. దోపిడీ లేని పాలన కావాలా అని ప్రశ్నించారు. రైతును రాజుగా చేసే బాధ్యత మాదని.. కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని.. పేదల ఆస్తులను దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్ అని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా.. రాష్ట్రంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. 

బోగస్ వ్యక్తులను నమ్మితే ఇబ్బందిపడతామని.. దొంగలు సృష్టించే నకిలీ వార్తలను నమ్మొద్దని ఆయన సూచించారు. కూటమి తరపున నిర్దిష్ట అజెండాతో ముందుకు వస్తున్నామని.. సూపర్ సిక్స్ ద్వారా ఆడబిడ్డలను శక్తిమంతులుగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ మళ్లీ వస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని.. కూటమి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయన్నారు. 

Also Read : ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో తెలుసు ..ఆ సీట్లు అందుకే వదులుకున్నా : పవన్ కళ్యాణ్

వాలంటీర్ల వేతనాలను రూ.10 వేలకు పెంచుతామని.. వాలంటీర్ వ్యవస్థ లేదు, రాజీనామా చేశారని అంంటున్నారని , వాలంటీర్లకు పూర్తిగా అండగా వుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. కారుమూరి వంటి ముదురును నా జీవితంలో చూడలేదని.. రూ.850 కోట్ల మేర టీడీఆర్ బాండ్లా స్కామ్ చేశారని టీడీపీ అధినేత ఆరోపించారు. 

పేదల ఇళ్ల పేరిట స్థలాలు కొని ప్రభుత్వానికి అమ్మారని.. ఇళ్ల స్థలాల పేరుతో దాదాపు రూ.70 వేల కోట్ల మేర కొట్టేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ నుంచి రేషన్ బియ్యం తరలించి దోచుకుంటున్నారని.. తణుకులో అభివృద్ధి చేయాలంటే కారుమూరి ట్యాక్స్ కట్టాలని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల గెలుపు.. రాష్ట్రం నిలబడటం కోసమే కూటమి కలయిక అన్నారు. 


Comments