స్వర్ణాంధ్ర సాకార యాత్ర : ప్రచార బరిలోకి బాలయ్య .. ఇక ‘‘ unstoppable ’’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్ధులను ఖరారు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర చేస్తున్నారు. ఇతర కీలక నేతలు కూడా ప్రచారంలో బిజీగా వున్నారు.
ఈ నేపథ్యంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచార బరిలో దిగనున్నారు. ఏప్రిల్ 19న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బాలయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఎన్డీయే కూటమి అభ్యర్ధుల తరపున ఆయన శనివారం నుంచి ‘‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర ’’ పేరుతో ప్రచారం నిర్వహించనున్నారు. దీనితో పాటు ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణ పర్యటించనున్నారు.
హిందూపురంలో హ్యాట్రిక్ విజయంపై బాలయ్య కన్ను :
ఇదిలావుండగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు టీడీపీ అక్కడ ఓడిపోయింది లేదు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్, ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1983 నుంచి 2019 వరకు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. సైకిల్ కంచుకోటను బద్ధలుకొట్టాలని హేమాహేమీలైన నేతలు ప్రయత్నించినప్పటికీ.. ప్రజలు మాత్రం టీడీపీ పక్షానే నిలుస్తూ వస్తున్నారు.
Also Read: రంజాన్ నెలలో బిర్యానీయే రారాజు.. ఏకంగా 60 లక్షల ఆర్డర్లు, హైదరాబాదే టాప్
నందమూరి బాలకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని బాలయ్య గట్టి పట్టుదలతో వున్నారు. మరోవైపు తెలుగుదేశం కంచుకోటను బద్ధలుకొట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈసారి మహిళా అభ్యర్ధిని బాలయ్యపై ప్రయోగించారు. జగన్‌తో పాటు వైసీపీ కీలక నేతలు హిందూపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
Comments
Post a Comment